కర్ణాటకలో గదగ్ జిల్లాలో ఘటన
రాయచూరు రూరల్: చనిపోయినవారు బతకడం చాలా అరుదు. అలాంటి వింత ఘటన ఉత్తర కర్ణాటకలోని గదగ్ జిల్లా బెటగేరిలో వెలుగుచూసింది. శుక్రవారం బెటగేరిలో ప్రైవేట్ ఆస్పత్రిలో మూత్ర పిండాల చికిత్స కోసం నారాయణ (38) అనే వ్యక్తిని చేర్పించారు. వైద్యులు అతనికి ఆపరేషన్ చేశారు. 6 గంటల తరువాత ఆయన చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు తీవ్ర రోదనల్లో మునిగిపోయారు.
చివరికి అంబులెన్సులో శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతలోనే నారాయణ కళ్లు తెరిచి ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడని అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


