వహ్‌! స్మార్ట్‌ఫోన్లకు శ్రాద్ధం పెట్టారు... సైబర్‌ నేరాలకు సమాధి కట్టారు!! | Haryana Village Destroys 55 Smartphones, Bans Smart Devices To Fight Cybercrime And Addiction, Watch Video Inside | Sakshi
Sakshi News home page

వహ్‌! స్మార్ట్‌ఫోన్లకు శ్రాద్ధం పెట్టారు... సైబర్‌ నేరాలకు సమాధి కట్టారు!!

Jun 24 2026 10:30 AM | Updated on Jun 24 2026 11:57 AM

Smartphones Buried Cybercrime Banished: Why This Indian Village Going Viral

స్మార్ట్‌ఫోన్‌.. మనిషి జీవితాన్ని సులభతరం చేసింది. అందులో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. కానీ అదే.. కొన్నిసార్లు వ్యసనంగా మారి కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఆన్‌లైన్‌ మోసాలు, సైబర్‌ నేరాలు, సోషల్‌ మీడియా వ్యసనాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఓ పల్లెటూరు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సైబర్‌ నేరాలకు దూరంగా ఉంటాం.. వాటి బారిన పడబోం.. అంటూ ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను పగలగొట్టారు ఇక్కడో ఊరి ప్రజలు. పైగా సామూహికంగా వాళ్లంతా ప్రతిజ్ఞ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హర్యానాలోని నుహ్‌ జిల్లాలో ఉన్న సుఖ్‌పురి గ్రామంలో ఇటీవల జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

వీడియోలో పలువురు యువకులు తమ ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను నేలకేసి కొడుతూ ధ్వంసం చేస్తూ కనిపించారు. మొత్తం 55 ఫోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఇకపై కీప్యాడ్‌ ఫోన్లనే ఉపయోగించాలని నిర్ణయించారు. యువత సైబర్‌ నేరాల బారిన పడకుండా చూడటం, స్మార్ట్‌ఫోన్‌ వ్యసనాన్ని తగ్గించడం, నిజాయితీతో కూడిన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

నుహ్‌ జిల్లా ఎస్పీ డాక్టర్‌ అర్పిత్‌ జైన్‌ ఇటీవల నేరాల్లో పాల్గొంటున్న వ్యక్తులు మార్పు దిశగా అడుగులు వేయాలని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం ప్రభావంతో గ్రామ యువకులు ఈ ప్రతీకాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నేర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవారు కూడా ఇకపై అలాంటి వాటికి దూరంగా ఉంటామని బహిరంగంగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా హాజరయ్యారు. నేరస్తులపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, మార్పు కోరుకునే వారికి అవకాశాలు కల్పించడం కూడా తమ బాధ్యతేనని వారు పేర్కొన్నారు. సాధారణ జీవితంలోకి తిరిగి రావాలనుకునే వారికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం వల్ల యువతలో తప్పుదోవ పట్టే ధోరణి పెరుగుతోంది. కొందరు గ్రామస్తులు అయితే మొబైల్‌ ఫోన్‌ల కారణంగా కుటుంబాల్లో విభేదాలు పెరిగాయని, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయని కూడా పేర్కొన్నారు. అందుకే నేర ప్రపంచంతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని గ్రామం నిర్ణయించింది.

నుహ్‌ జిల్లా గత కొన్నేళ్లుగా సైబర్‌ నేరాలకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్‌ మోసాల్లో గణనీయమైన కేసులు ఈ ప్రాంతంతోనూ సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిరుద్యోగం, పేదరికం, తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయం కారణంగా కొందరు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫిషింగ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాల వైపు ఆకర్షితులవుతున్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు.

అయితే అదే జిల్లాకు చెందిన సుఖ్‌పురి గ్రామం మాత్రం వేరే దారి ఎంచుకుంది. స్మార్ట్‌ఫోన్‌ను పగలగొట్టడం ద్వారా సమస్య అంతమవుతుందా లేదా అన్నది పక్కన పెడితే... యువతను నేరాల నుంచి దూరం పెట్టాలనే సంకల్పానికి ఇది ప్రతీకగా నిలిచింది. సాంకేతికతతో వస్తున్న సవాళ్లకు తమదైన పరిష్కారం వెతికిన ఓ ఊరు తీసుకున్న నిర్ణయంగా ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement