
ముంబై: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టు ఊరట ఇచ్చింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యల కేసులో తాము తుది ఆదేశాలిచ్చేదాకా కమ్రాను అరెస్ట్ చేయొద్దంటూ బుధవారం ఆదేశాలు వెలువరించింది. కునాల్ కమ్రా వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసింది.
ఓ షోలో షిండేను ఉద్దేశించి పేరడీ సాంగ్ పాడే క్రమంలో ‘దేశద్రోహి’ అంటూ కునాల్ కమ్రా వ్యాఖ్యానించిన సంగతి తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకుగానూ ఖర్ పీఎస్‌లో కమ్రాపై కేసు నమోదు అయ్యింది. అయితే.. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్ కోత్వాల్, ఎస్ మోదాక్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
అయితే.. షిండేను ఉద్దేశించి దేశద్రోహి అనే వ్యాఖ్యలు కేవలం కునాల్ కమ్రా ఒక్కరే చేయలేదని, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలు ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ వ్యాఖ్యలు చేశాయని(అప్పట్లో అజిత్ పవార్, ఉద్దవ్ థాక్రేలు షిండేను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు), అయినప్పటికీ ఎలాంటి చర్యలు కనిపించలేదని కమ్రా తరఫు న్యాయవాది నవ్రోజ్ సీర్వై వాదించారు. కానీ, ఈ కేసులో కావాలనే తన క్లయింట్, అతని తల్లిదండ్రుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. అంతేకాదు.. రాజకీయ పార్టీల నుంచి కునాల్‌కు బెదిరింపులు వస్తున్న విషయాన్ని కూడా తెలియజేశారు. పలు షోలలో కునాల్ కమ్రా ఇదే తరహాలో రాజకీయాలపై, రాజకీయ నేతలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడమూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే.. కునాల్ క్వాష్ అభ్యర్థనను తిరస్కరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిటెన్ వేణేగావోంకర్ బెంచ్‌ను కోరారు. ఇదేం చతురతతో కూడిన విమర్శ కానేకాదని.. వ్యక్తిగతంగా ఓ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడమేనని వాదించారు. గతంలో ద్రోహి వ్యాఖ్యలపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న వాదనతో అంగీకరించిన పీపీ.. అలాగని ఇలాంటి వ్యవహారాలను చూస్తూ ఊరుకోకూడదన్నారు. అలాగే.. తనకు ప్రాణహాని ఉందని కునాల్ ముందుకు వస్తే భద్రత కలిగించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటిచింది. అంతకు ముందు ఇదే పిటిషన్‌పై విచారణ సందర్భంగా కునాల్‌కు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట అందించిన సంగతి తెలిసిందే.