‘జీలం’ ఒడ్డున అద్భుత యోగా విన్యాసాలు | Scenic Yoga Event Rules Jhelum Banks Ahead of Yoga Day 2026 | Sakshi
Sakshi News home page

‘జీలం’ ఒడ్డున అద్భుత యోగా విన్యాసాలు

Jun 21 2026 8:19 AM | Updated on Jun 21 2026 11:12 AM

Scenic Yoga Event Rules Jhelum Banks Ahead of Yoga Day 2026

శ్రీనగర్‌: నేడు(ఆదివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతు​న్నాయి.  ఈ నేపధ్యంలో జమ్ముకశ్మీర్ లోయలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పచ్చని ప్రకృతి, గలగల పారే జీలం నది కలయిక మధ్య సరికొత్త యోగా జోష్ కనిపించింది. ఫిట్‌నెస్, మానసిక ప్రశాంతతను చాటిచెబుతూ జమ్ముకశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ ప్రత్యేక ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

జీలం నది సాక్షిగా యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ్రీనగర్‌లోని జీలం నది ఒడ్డున  యోగా కార్యక్రమాన్ని  నిర్వహించారు. కనువిందు చేసే కాశ్మీరీ లోయల నేపథ్యంలో సాగిన ఈ వినూత్న వెల్నెస్ సెషన్‌లో వందలాది మంది యోగా ప్రేమికులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చల్లని నదీ తీరాన ప్రకృతితో మమేకమవుతూ ప్రతి ఒక్కరూ వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి ఫిట్‌నెస్‌పై తమకున్న మక్కువను చాటుకున్నారు.

క్రీడాకారుల అద్భుత ప్రదర్శన
ఈ విశేష వేడుకలో వివిధ క్రీడా విభాగాలకు చెందిన అథ్లెట్లు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. నిత్య జీవితంలో ఎదురయ్యే శారీరక, మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి యోగా ఏ విధంగా తోడ్పడుతుందో ఈ సందర్భంగా క్రీడాకారులు ఆచరించి చూపించారు. క్రీడల్లో రాణించాలన్నా, నిత్యం చురుగ్గా ఉండాలన్నా యోగాను మించిన సాధనం లేదని ఈ కార్యక్రమం ద్వారా వారు నిరూపించారు.

సరికొత్త చైతన్యం వైపు అడుగులు
భారతీయ ప్రాచీన సంస్కృతి అయిన యోగా విశిష్టతను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రోజువారీ జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే తమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో నిర్వహించిన ఈ వినూత్న ప్రయత్నం మరింత మందిని యోగా వైపు నడిపించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement