నిబంధనలు ఉల్లంఘించినందుకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు
రూ.5,000 పూచీకత్తుపై అజింక్య షిండే విడుదల
ఆరు నెలల పాటు స్రత్పవర్తనతో నడుచుకోవాలని షరతు
ప్రైవేట్ ఇంటి ఆవరణలోకి చొరబడ్డారని, బెయిల్
నిబంధనలను బేఖాతరు చేశారని ఆరోపణలు
న్యూఢిల్లీ: నిరసనలకు అనుమతి లేని జంతర్‌మంతర్‌కు చేరుకునేందుకు ఒక ప్రైవేట్ ఇంటి ఆవరణలోకి చొరబడడం, శాంతిని కాపాడాలన్న నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు కోర్టు ఐదు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. మరో నాయకుడు అజింక్య షిండేను రూ.5,000 పూచీకత్తు(ష్యూరిటీ)పై విడుదల చేసినట్లు చెప్పారు.
ఆరు నెలల పాటు శాంతియుతంగా, సత్ప్రవర్తనతో నడుచుకోవాలని షరతు విధించినట్లు వెల్లడించారు. బుధవారం ఉదయం నిందితులను ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. నిబంధనలను పదేపదే ఉల్లంఘించడాన్ని, బెయిల్‌పై విడుదల చేస్తే మళ్లీ చట్టాన్ని ఉల్లంఘించి ఇతరులను రెచ్చగొడతారన్న పోలీసుల వాదనను స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకున్నారు. సౌరవ్ దాస్, రాంకాలకు ఐదు రో జుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పోలీ సులు వీరిని తీహార్ జైలుకు తరలించారు.
విధులకు ఆటంకం కలిగించారు: పోలీసులు
ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జంతర్‌మంతర్ ప్రాంతంలోకి ప్రవేశించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు సీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అంతకుముందు శనివారమే అరెస్టయ్యి విడుదలయ్యారు. ఒక సంవత్సరం పాటు శాంతిని కాపాడతామని అంగీకరిస్తూ బాండ్లపై వారు సంతకాలు చేశారని, అయినప్పటికీ శాంతిని భగ్నం చేస్తూ జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. అందుకే నిబంధనల ప్రకారం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
శనివారం జంతర్‌మంతర్‌లో నిరసనల సందర్భంగా మొత్తం 14 మందిని అదుపులోకి తీసుకొని, వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. నిందితులకు బెయిల్ లభించని బీఎన్ఎస్ సెక్షన్లు 332, 132, 121(1) కూడా ఇందులో ఉన్నాయి. నిరసనకారులు తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజా శాంతికి భంగం కలిగించడానికి, చట్టాన్ని ఉల్లంఘించడానికి వారు ప్రయత్నించారని స్పష్టంచేశారు. సోషల్ మీడియా ద్వారా ఇతరులను చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ప్రేరేపించేందుకు వారు ప్రయత్నాలు సాగించినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయని వెల్లడించారు
అరెస్టు హాస్యాస్పదం: కేజ్రీవాల్
సొంత దేశంలో జాతీయ జెండాను ఎగురవేయడం నేరమా? అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. సీజేపీ నాయకులను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించడం పూర్తిగా హాస్యాస్పదం అని బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సీజేపీ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అని ఆప్ ఢిల్లీ విభాగం చీఫ్ సౌరభ్ భరద్వాజ్ విమర్శించారు. నిరసనకారుల డిమాండ్లకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని తెలిపారు.
అణచివేతను సహించొద్దు: మమత
కాక్రోచ్ జనతా పార్టీ నేతల అరెస్టును పశి్చమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పటికీ యువతకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు ఐక్యంగా పోరాడాలని చెప్పారు. మనమంతా దృఢంగా నిలబడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఒక తరం మొత్తాన్ని భయపెట్టి, వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. అణచివేతను సహించడానికి వీల్లేదన్నారు. మన రాజ్యాంగపరమైన హక్కులను ఎప్పటికీ వదులుకోకూడదని తేల్చిచెప్పారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య హత్య జరుగుతోందని మమత ఆందోళన వ్యక్తంచేశారు.
ఖండించిన విపక్ష నేతలు
సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు అరెస్టు చేయడాన్ని పలువురు ప్రతిపక్ష నాయకులు ఖండించారు. పోలీసుల చర్యను సీపీఐ(ఎంఎల్) లిబిరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా తదితరులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదా? అని ధ్వజమెత్తారు.


