సాక్షి, బనశంకరి: ప్రేమ విఫలం కావడంతో ప్రియుడి పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. ప్రేమ విఫలమైన బాధ ఆమెను వెంటాడంతో ప్రియుడిపై కసి తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి పేరుతో బాంబు బెదిరింపులకు పాల్పడింది. విమానాశ్రయాలు, బడులు, కాలేజీలు, ప్రభుత్వ సంస్థలను తరుచూ బెదిరిస్తున్న ఆ యువతిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ మీడియాకు వెల్లడించారు. రెని జోషిల్డా బెంగళూరులో రోబోటిక్స్ ఇంజినీర్‌గా పనిచేసేది. సహోద్యోగితో ప్రేమ విఫలం కావడం.. అతను మరో యువతిని పెళ్లాడాడు. దీంతో అతనిపై పగ పెంచుకుంది. ప్రియుడి పేరుతో నకిలీ ఈ–మెయిల్స్, వాట్సాప్ అకౌంట్లు సృష్టించి.. వాటి ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు పంపించేది.
అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ క్రికెట్ ప్రాంగణంతో పాటు బెంగళూరులోని ఆరు విద్యాలయాల్లో బాంబులు పెట్టినట్లు గతంలో హెచ్చరించింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదానికి తన ప్రియుడు కారణమంటూ ఈ–మెయిల్ పంపింది. ప్రియుడి పేరిట బెదిరిస్తే.. అతడిని అరెస్టు చేస్తారనేది ఆమె ప్లాన్. ఇలా జూన్ 14న బెంగళూరు వాసులను హడలెత్తించింది. ఆ కేసు విచారణ ఉత్తర విభాగం సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టారు. ఆరు పాఠశాలలకు బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆమె ప్రాథమిక విచారణలో అంగీకరించిందని కమిషనర్ వివరించారు. దీంతో, దర్యాప్తు మొదలుపెట్టిన గుజరాత్ పోలీసులు.. విచారణ జరిపి రెని జోషిల్డాను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అహ్మదాబాద్ జైలు నుంచి వారెంట్‌పై బెంగళూరుకు తెస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆమెను విచారిస్తున్నామని వెల్లడించారు.


