కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్న టీఎంసీ రెబెల్ ఎమ్మెల్యేలు
టీఎంసీకి సమాంతరంగా పార్టీ నిర్మాణం
ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తాం
జిల్లా కమిటీలను కూడా నియమిస్తామన్న రితబ్రత బెనర్జీ
మమత ముఖ్య సలహాదారుగా ఉండొచ్చని వ్యాఖ్య
కోల్‌కతా: మాజీ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో ఉన్న టీఎంసీని తమ అ«దీనంలోకి తెచ్చుకునేందుకు తిరుగుబాటు వర్గం వేగంగా పావులు కదుపుతోంది. సోమవారం ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ అధ్యక్షతన సమావేశమైన టీఎంసీ రెబెల్ వర్గం ఎమ్మెల్యేలు తమ చైర్‌పర్సన్‌గా అరూప్ రాయ్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి కౌన్సెలర్లు, ఇతర నేతలు సైతం హాజరయ్యారు.
రాయ్‌ని ఏకగ్రీవంగా పార్టీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నామని చెప్పారు. అంతేకాకుండా, మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్, ఎమ్మెల్యేలు ఫిర్హాద్ హకీమ్, రతిన్ ఘోష్, సబినా యాస్మిన్‌లను వైస్ చైర్‌పర్సన్లుగా, రితబ్రత బెనర్జీ, జావెద్ ఖాన్, సాందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగాను, అఖ్రుజ్జమాన్ అన్సారీని ట్రెజరర్‌గాను నియమించారు. మమత సారథ్యంలోని టీఎంసీని సంస్థాగతంగా సవాల్ చేసే చర్యగా దీనిని భావిస్తున్నారు.
అసెంబ్లీలో ప్రారంభమై, పార్లమెంట్‌కు సైతం పాకిన ఈ తిరుగుబాటు ఇప్పుడు పార్టీ అధిష్టానానికి కూడా చేరుకుందనే సంకేతాన్ని ఈ పరిణామంతో స్పష్టమవుతోంది. తమ వర్గానికి చట్టబద్ధత కల్పించేందుకుగాను పార్టీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామని, ఈ వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని బెనర్జీ స్పష్టం చేశారు. తమదే టీఎంసీ అంటూ ఆయన.. ఏది అసలైన టీఎంసీనో ఎన్నికల కమిషనే నిర్ణయిస్తుందని కూడా చెప్పారు.
నూతన నాయకత్వం త్వరలోనే వివిధ స్థాయిల్లో పార్టీ నియామక, సంస్థాగత నిర్మాణాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన చెప్పారు. త్వరలోనే జిల్లా కమిటీలను, రాష్ట్ర విభాగాన్ని, ప్రతినిధుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇష్టమైతే, తమ వర్గానికి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుగా ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె ముఖ్య సలహాదారుగా వస్తానంటే సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెలిసిందే. అసెంబ్లీకి ఎన్నికైన 80 మందికిగాను ఏకంగా 58 మంది రెబెల్ వర్గంలో చేరగా, పార్లమెంట్‌లో 28 మంది ఎంపీల్లో 20 మంది వేరు కుంపటి పెట్టుకున్నారు.


