
12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారం నేడు (గురువారం) మరోమారు తెరిచారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. రత్న భాండాగారంలోని విలువైన ఆభరణాలను లోపలి ఛాంబర్ నుండి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌నకు తరలించనున్న నేపధ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్‌జేటీఏ) చీఫ్ అరబింద పాధి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత ఎవరినీ లోనికి అనుమతించడం లేదన్నారు. ఆలయ సింహద్వారం మాత్రమే తెరిచివుంచి, మిగతా తలుపులన్నీ మూసి వేశామని తెలిపారు. గత కొన్నేళ్లుగా భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన వస్తువులను ఆలయ సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లోనికి తరలించనున్నట్లు అరబింద పాధి తెలిపారు.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్టోర్‌హౌస్‌కు ఆభరణాలను తరలించేందుకుగాను రత్న భండాగారం లోపలి గదిని ఆలయ పరిపాలనా యంత్రాంగం (ఎస్‌జేటీఏ) తిరిగి తెరిచింది. ఎస్‌జేటీఏ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి, జస్టిస్ విశ్వనాథ్ రథ్ (రత్నాల భాండాగారాన్ని పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షక కమిటీ చైర్మన్), పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఇతర అధికారుల సమక్షంలో రత్న భాండాగారం లోపలి గదిని తెరిచారు. ఉదయం 9:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు అధికారులు రత్న భాండాగారంలో ఉండనున్నారు. ఇక్కడి విలువైన వస్తువులను తాత్కాలిక స్టోర్‌హౌస్‌కి తరలించనున్నారు.ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్నారు.