ఎన్నికల్లో ఘన విజయం.. ఆ వెంటనే రాజకీయ సన్యాసం! | Poll Victory, Then Political Exit, Who Is Pradyot Debbarma And Why Did He Quit Politics? | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో ఘన విజయం.. ఆ వెంటనే రాజకీయ సన్యాసం!

Oct 8 2026 1:02 PM | Updated on Oct 8 2026 1:22 PM

Poll Victory Then Political Exit: Who Is Pradyot Debbarma?

గిరిజనుల హక్కులు, గుర్తింపు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమంగా మొదలై.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారింది. అతి తక్కువ కాలంలోనే వరుస సంచలన విజయాలు నమోదు చేసింది. తాజాగా దశాబ్దం తర్వాత జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించింది. ఇంతటి విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలోనే ఆ పార్టీ అధినేత సంచలన నిర్ణయం ప్రకటించారు. ‘‘కిందికి పడిపోతున్నప్పుడు కాదు.. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే వైదొలగాలి’’ అన్న తన తండ్రి మాటకు కట్టుబడి రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.

త్రిపుర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తిప్రా మోతా పార్టీ(TIPRA Motha Party) వ్యవస్థాపకుడు రాజా ప్రద్యోత్‌ కిషోర్‌ మాణిక్య దేబ్బర్మ(Pradyot Bikram Manikya Deb Barma) క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన 48 ఏళ్ల దేబ్బర్మ.. రాజకీయాలకు దూరమైనా తిప్రాసా ప్రజల హక్కుల కోసం తన గొంతు వినిపిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

గెలుపు తర్వాతే సంచలన ప్రకటన
త్రిపుర ట్రైబల్‌ ఏరియాస్‌ అటానమస్‌ డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌ (TTAADC) పరిధిలో దాదాపు పదేళ్ల తర్వాత విలేజ్‌ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఇందులో తిప్రా మోతా పార్టీ భారీ విజయం సాధించింది. 587 విలేజ్‌ కమిటీల పరిధిలోని 4,594 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. తిప్రా మోతా 4,328 స్థానాలను గెలుచుకుంది. ఈ విజయం తర్వాతే దేబ్బర్మ తన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయాన్ని ప్రకటించారు.

అయితే ఈ విజయాన్ని పార్టీ విజయంగా మాత్రమే చూడొద్దని దేబ్బర్మ పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉన్న గ్రామాల్లో ఇప్పుడు ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకున్నారని.. ఇది గ్రామీణ ప్రజల విజయమని అన్నారు. కొత్తగా ఎన్నికైన విలేజ్‌ కమిటీ అధ్యక్షులు నిజాయితీగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

‘నిజమైన సంబరం అప్పుడే..’
ఎన్నికల్లో విజయం సాధించినా సంబరాలు చేసుకోవడానికి ఇది సమయం కాదని దేబ్బర్మ అన్నారు. తిప్రాసా ప్రజలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు అందినప్పుడే అసలైన విజయోత్సవం జరుపుకోవాలని చెప్పారు. ముఖ్యంగా 2024లో కేంద్ర, త్రిపుర ప్రభుత్వాలు, తిప్రా మోతా నాయకత్వం మధ్య కుదిరిన తిప్రాసా ఒప్పందం అమలు కావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఒప్పందం అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. దుర్గా పూజ తర్వాత తిప్రాసా ఒప్పందం అమలు ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా హామీ ఇచ్చారని దేబ్బర్మ తెలిపారు. ఇంతకాలం ప్రజలు ఓపికగా ఎదురుచూశారని.. ఇకనైనా హామీ అమలు కావాలని అన్నారు.

రెండేళ్లకే 13 మంది ఎమ్మెల్యేలు
త్రిపుర రాజకుటుంబానికి చెందిన ప్రద్యోత్‌ కిషోర్‌ మాణిక్య దేబ్బర్మ రాజకీయ ప్రస్థానం కూడా ఆసక్తికరమే. కాంగ్రెస్‌లో పనిచేసిన ఆయన 2019లో ఆ పార్టీని వీడి తిప్రాసా ప్రజల హక్కుల కోసం ప్రత్యేక రాజకీయ వేదికను నిర్మించే దిశగా అడుగులు వేశారు. తొలుత ‘తిప్రా’ను ఉద్యమంగా ప్రారంభించి, 2021లో తిప్రా మోతా రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంది. అదే ఏడాది జరిగిన టీటీఏఏడీసీ ఎన్నికల్లో 30 స్థానాల్లో 18 గెలిచి అధికారాన్ని దక్కించుకుంది.

ఆ తర్వాత 2023లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. 42 స్థానాల్లో బరిలోకి దిగి 13 సీట్లు గెలుచుకుంది. అన్నీ ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలే. దాదాపు 20 శాతం ఓట్లతో బీజేపీ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

2024లో పార్టీకి చెందిన అనిమేశ్‌ దేబ్బర్మ, బృషకేతు దేబ్బర్మలు త్రిపుర ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు. ఇక 2026లో జరిగిన టీటీఏఏడీసీ ఎన్నికల్లో తిప్రా మోతా 28లో 24 సీట్లు గెలిచి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తిప్రా మోతా ఇప్పటివరకు ఎంపీ సీటు గెలవలేదు. 2024లో త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది.

అనుకోకుండా రాజకీయాల్లోకి..
రాజకీయాలకు వీడ్కోలు పలుకుతూ దేబ్బర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదట రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. అయితే తిప్రాసా ప్రజల హక్కుల కోసం రాజకీయ పోరాటం అవసరమని భావించి ఆ దిశగా అడుగుపెట్టానన్నారు. తన తండ్రి మహారాజా కిరీట్‌ బిక్రమ్‌ మాణిక్య చెప్పిన మాటలను కూడా గుర్తుచేశారు. ‘కిందికి పడిపోతున్నప్పుడు కాదు.. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే వైదొలగాలి’ అనేది తన తండ్రి చెప్పేవారని తెలిపారు. ప్రస్తుతం తాను అదే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

48 ఏళ్లకే రిటైర్మెంట్‌
తన నిర్ణయానికి ఆరోగ్య కారణాలు ప్రధానమని దేబ్బర్మ స్పష్టం చేశారు. ఇకపై రాజకీయ పదవులు చేపట్టడం, రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం చేయబోనని తెలిపారు. దీర్ఘకాలంగా రాజకీయ కార్యక్రమాలు, ప్రయాణాలు, ప్రజా జీవితం కారణంగా తన ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత ప్రశాంతతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అయితే ఇది ప్రజలకు పూర్తిగా దూరమయ్యే నిర్ణయం కాదని స్పష్టం చేశారు. రాజకీయ వేదిక నుంచి తప్పుకున్నా తిప్రాసా ప్రజల హక్కులకు అన్యాయం జరిగితే మాట్లాడుతూనే ఉంటానన్నారు.

‘చివరి రాజకీయ సభ..’
వచ్చే నెలలో భారీ ర్యాలీ నిర్వహించాలని తిప్రా మోతా కార్యకర్తలను దేబ్బర్మ కోరారు. తాజాగా ఎన్నికైన విలేజ్‌ కమిటీ అధ్యక్షులందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. అదే వేదిక నుంచి రాజకీయ నాయకుడిగా తన చివరి ప్రసంగం చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల విజయాన్ని అంతిమ విజయంగా భావించవద్దని కూడా ఆయన సూచించారు. తిప్రాసా ప్రజల రాజ్యాంగ హక్కులు సాధించడమే అసలు లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇక పార్టీని నడిపించేది ఎవరు?
దేబ్బర్మ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడంతో తిప్రా మోతా భవిష్యత్‌ నాయకత్వంపై ఆసక్తి నెలకొంది. సీనియర్‌ నేతలు పార్టీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రజల హక్కుల విషయంలో ఎలాంటి రాజీకి వెళ్లొద్దని దేబ్బర్మ ఇప్పటికే పార్టీ నేతలకు సూచించారు. రాజకీయాలకు దూరమైనా తిప్రాసా ప్రజలతో తన అనుబంధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాజకీయాల నుంచి తప్పుకునే నిర్ణయం తీసుకోవడం వెనుక.. తిప్రాసా ఒప్పందం అమలే తన తదుపరి ప్రధాన లక్ష్యంగా దేబ్బర్మ మాటలు సూచిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే: భారత ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement