
రూ.5,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో నేడు ప్రధాని మోదీ పర్యటించి రూ.5,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ పట్టణంలో బీజేపీ చేపట్టిన భారీ ర్యాలీలోనూ ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్–మే కాలంలో పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈనెల 21వ తేదీన కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో అమరవీరుల దినోత్సవ ర్యాలీ జరగనున్న నేపథ్యంలో అంతకుముందే మోదీ రాష్ట్రంలో పర్యటిస్తుండటం గమనార్హం. ‘‘బిహార్ నుంచి ప్రధాని మోదీ శుక్రవారం దుర్గాపూర్‌కు చేరుకుంటారు. తొలుత వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టుల కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. తర్వాత పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు’’అని బెంగాల్ బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
పశ్చిమబెంగాల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సమీర్ భట్రాచార్యను బీజేపీ అధిష్టానం నియమించాక రాష్ట్రానికి మోదీ రావడం ఇదే తొలిసారి. త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో టీఎంసీ అధికారికంగా నిర్వహించే చివరి అమరవీరుల దినోత్సవం ఇదేకావడంతో ఈ కార్యక్రమంలోనే టీఎంసీ తన ఎన్నికల అజెండాను ప్రకటించే వీలుందని తెలుస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త పథకాలనూ మమతా బెనర్జీ ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతకుముందే ఈ తరహా హామీలను శుక్రవారం జరగబోయే బహిరంగ సభలో మోదీ ప్రకటిస్తారని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.
రూ.1,950 కోట్లతో బీపీసీఎల్ ప్రాజెక్ట్
రూ.1,950 కోట్లతో చేపట్టనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)వారి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దుర్గాపూర్–హల్దియా గ్యాస్ పైప్‌లైన్‌లోని 132 కిలోమీటర్ల దుర్గాపూర్–కోల్‌కతా సెక్షన్‌ను మోదీ శుక్రవారం జాతికి అంకితంచేయనున్నారు. పీఎం ఉర్జా గంగా ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.1,190 కోట్లతో దీనిని పూర్తిచేశారు. పూర్బ బర్ధమాన్, హూగ్లీ, నదియా జిల్లాల్లో లక్షలాది కుటుంబాలకు సహజవాయువు సరఫరాను సుసాధ్యంచేయడంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధికి ఈ ప్రాజెక్ట్ బాటలు వేస్తోంది.
బిహార్‌లోనూ మోదీ పర్యటన
శుక్రవారం బిహార్‌లోనూ మోదీ పర్యటించనున్నారు. రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభిచనున్నా రు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరీ పట్టణంలోని గాంధీ మైదాన్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. ఈ సభకు 5,00,000 మంది హాజరవుతారని అంచనా. అందుకు తగ్గట్లు భారీ ఏర్పాట్లుచేస్తున్నట్లు జిల్లా మేజి్రస్టేట్ సౌరభ్ జోర్వాల్ చెప్పారు. రూ.4,079 కోట్లతో పూర్తిచేసిన దర్భాంగా– నార్కాటియాగంజ్ 256 కిలోమీటర్ల రైల్వేలైన్ డబ్లింగ్‌ను మోదీ జాతికి అంకితంచేయనున్నారు.