కొన్ని కుటుంబాలకే ఘనత దక్కాలని ఆరాటపడ్డారు
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం
తాము వచ్చాకే బిర్సా ముండాకు గౌరవం దక్కిందని వెల్లడి
గాందీనగర్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు చిరస్మరణీయమైన పాత్ర పోషించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కానీ, 60 ఏళ్లపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ మన గిరిజన యోధులను ఏనాడూ పట్టించుకోలేదని, పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. గిరిజనుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టారు. స్వాతంత్య్ర పోరాట ఘనత ‘కొన్ని కుటుంబాలకే’ దక్కాలన్నదే కాంగ్రెస్ అసలు ఉద్దేశమని విమర్శించారు.
గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని దెడియాపాద పట్టణంలో నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ్ దివస్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.9,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.2,320 కోట్లతో నిర్మించే 50 ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ–ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్ కింద నిర్మించిన లక్ష ఇళ్ల గృహ ప్రవేశాన్ని వర్చువల్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ ప్రతిష్ట, ఆత్మగౌరవం, స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో ఎల్లప్పుడూ గిరిజన బిడ్డలే ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అడవి బిడ్డల నుంచి ఎంతోమంది స్వాతంత్య్ర పోరాట యోధులు ఉద్భవించారని గుర్తుచేశారు. గుజరాత్‌లో గోవింద్ గురు, రూప్‌సింగ్ నాయక్, మోతీలాల్ తేజావత్ వంటి గిరిజనులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఈ ఉద్యమంలో లెక్కలేనన్ని అధ్యాయాలు గిరిపుత్రుల ధైర్యసాహసాలతో నిండిపోయాయని అన్నారు.
న్యాయం చేయాలని సంకల్పించాం
‘‘దేశ స్వేచ్ఛ కోసం రక్తం చిందించిన గిరిజనులకు తగిన గుర్తింపు దక్కలేదు. కొందరి కుట్రల కారణంగా వారు తెరవెనుకే ఉండిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు గిరిజనుల త్యాగాలను, అంకితభావాన్ని పూర్తిగా విస్మరించారు. 2014 కంటే ముందు భగవాన్ బిర్సా ముండాను ఎవరూ స్మరించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయనకు గౌరవం దక్కింది. జార్ఖండ్‌లో బిర్సా ముండా ఇంటిని సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిని నేనే.
జనజాతీయ గౌరవ్ దివస్ అనేది గిరిపుత్రులకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవడానికి దక్కిన అవకాశం. అడవి బిడ్డల పట్ల కాంగ్రెస్ నిర్వాకాలు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. గిరిజనులకు శ్రీరాముడితో అనుబంధం ఉంది. వారు శ్రీరాముడి కాలానికి చెందినవారు. అయినా ఆ సంగతి కాంగ్రెస్ ప్రభుత్వాలకు పట్టలేదు. వారి జీవితాలను మెరుగుపర్చాలని ఏనాడూ ఆలోచించలేదు. మేయు గిరిజనుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వారికి న్యాయం చేకూర్చాలని సంకల్పించాం. గిరిజనుల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్‌పేయిదే.
నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం
మేరీ కోమ్, దుతీ చంద్, బైచుంగ్ భూటియా వంటి గిరిజన యువతీ యువకులు అంతర్జాతీయ వేదికపై మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు వస్తుండడం సంతోషంగా ఉంది. పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచ్ కప్ సాధించిన మన క్రీడాకారుల బృందంలో ఒక గిరిజన బిడ్డ కూడా ఉండడం గర్వకారణం. మన ప్రభుత్వం గిరిజనుల్లో నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహిస్తోంది. అణగారిన వర్గాలకు సైతం అందరితోపాటు సమాన అవకాశాలు దక్కాలి. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాం. గత ఐదేళ్లలో మోడల్ గిరిజన పాఠశాలల నిర్మాణానికి రూ.18,000 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేశాం. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఫలితంగా గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య ప్రతిఏటా భారీగా పెరుగుతోంది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు.
పండోరి మాత ఆలయంలో పూజలు
నర్మదా జిల్లాలోని దేవమోగ్రా గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం పండోరి మాత ఆలయాన్ని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సూరత్ నగరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ పురోగతిని మోదీ సమీక్షించారు.
బిర్సా ముండాకు నివాళులు
స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన విప్లవకారుడు భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఘనంగా నివాళులరి్పంచారు. పరాయి పాలకుల దౌర్జన్యాలపై ఆయన సాగించిన పోరాటాలు, చేసిన త్యాగాలు ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా దేశమంతటా నిర్వహించారు.


