సూరత్: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(నవంబర్ 15, శనివారం) గుజరాత్‌లో పర్యటించారు. నర్మాదా దేవ్‌మోగ్రా ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిర్సా ముండా జయంతి వేడుకలకు ప్రధాని హాజరయ్యారు. రూ.9,700 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఉదయం సూరత్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్‌ను సందర్శించి.. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్ (MAHSR) పురోగతిని సమీక్షించారు. ఎంఏహెచ్‌ఎస్‌ఆర్ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఒకటి. ఇది సుమారు 508 కి.మీ. పొడవు.

అందులో 352 కి.మీ. గుజరాత్, దాద్రా-నగర్ హవేలీలో, 156 కి.మీ. మహారాష్ట్రలో ఉంది. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదరా, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, ముంబై వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతతో నిర్మాణం జరుగుతోంది.


