సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జూన్ 28 (ఆదివారం) లేదా జూన్ 29 (సోమవారం) మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజన జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాల ప్రకారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన తేదీలపై చర్చించినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించబడలేదు. కాగా, ఈసారి యువత, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) ఆశయాలకు అనుగుణంగా కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పనితీరు ఆధారంగా కొంతమంది సీనియర్ మంత్రులను తప్పించి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాజీ ఆర్‌బీఐ గవర్నర్ చాన్స్..
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే ప్రస్తుతం ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ను విద్యాశాఖకు మార్చి, ఆర్థిక శాఖకు కొత్త నాయకత్వాన్ని తీసుకురావచ్చని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురిలను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అలాగే, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్‌కు మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం కొనసాగుతోంది.
ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ప్రాధాన్యం పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని సమాచారం. ముఖ్యంగా శివసేన (షిండే వర్గం) నుంచి ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్ పేర్లు కూడా కొత్త మంత్రుల జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరిని తప్పించే అవకాశం ఉందని, పంజాబ్‌లో రవ్నీత్ సింగ్ బిట్టూ స్థానంలో బీజేపీ నేత తరుణ్ చుగ్‌కు అవకాశం ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.
నితీశ్‌కు అవకాశం..
ఇదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక స్థానం కల్పించే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై కూడా అధికారిక స్పష్టత లేదు. ఇక కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ వద్ద ఉన్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి బాధ్యతలను మార్చి, ఆయుష్ శాఖను మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖను మరో మంత్రికి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, పనితీరు సరిగా లేదనే అభిప్రాయంతో అరడజను మంది కేంద్ర సహాయ మంత్రులను (MoS) మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కూడా ఉన్నాయని ఢిల్లీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


