న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్ల స్మారకోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శుక్రవారం) న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక స్మారక స్టాంపు, నాణేన్ని విడుదల చేశారు. అలాగే దేశ పౌరులు జాతీయ గీతాన్ని ఆలపించి, సంబంధిత వీడియోలను అప్‌లోడ్ చేసి సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని కూడా ప్రకటించారు. వీటితో పాటు ‘vandemataram150.in’ అనే పోర్టల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వందేమాతరం ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం అని అన్నారు. దీనిని భారతమాతకు నివేదించే భక్తి, ఆరాధనగా పేర్కొన్నారు.
తన ప్రసంగంలో ప్రధాని మోదీ వందేమాతర గీతం గొప్పదనాన్ని వివరిస్తూ.. ఇది మనకు ఘన చరిత్రను గుర్తు చేస్తుందని, వర్తమానాన్ని ఆత్మవిశ్వాసంతో నింపుతుందని, బంగారు భవిష్యత్తు కోసం ధైర్యాన్ని అందిస్తుందని అన్నారు. వందేమాతరం సామూహికంగా పాడటం అనేది భావ వ్యక్తీకరణకు మించిన అనుభూతి అని, ఇది హృదయాన్ని కదిలిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ ఈ పాట ద్వారా స్వతంత్ర, ఐక్య, సంపన్న భారతదేశం కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


