
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రస్తుతం మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్ చేరుకున్న ఆయన ఈరోజు(సోమవారం) భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు. అయితే ఆయన విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(Global Investors Summit) జరిగే ప్రాంతానికి నిర్థారించిన విధంగా ప్రధాని ఉదయం 9.45కు హాజరు కావలసివుంది. అయితే ఈ కార్యక్రమానికి 10 గంటలకు వెళ్లే విధంగా ప్రధాని మోదీ తన షెడ్యూల్ మార్చుకున్నారు. నగరంలోని పలు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తన కాన్వాయ్ కారణంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకే ప్రధాని మోదీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.
భోపాల్‌లోని నేషనల్ మ్యూజియంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పారిశ్రామిక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే దేశ, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్(Aditya Birla Group) చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ నాదిర్ గోద్రేజ్, రస్నా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ అధ్యక్షుడు పిరోజ్ ఖంబట్టా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ బాబా ఎన్ కళ్యాణి, సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రాహుల్ అవస్థి, ఏసీసీ లిమిటెడ్ సీఈఓ నీరజ్ అఖౌరి తదితరులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు.
