
రూ.86 వేల కోట్ల బడ్జెట్‌లో రూ.23,446 కోట్ల బకాయిలు
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికలో వెల్లడి
కనీస పని దినాలను 150కు పెంచాలని కేంద్రానికి సిఫార్సులు
సాక్షి, న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో పావు వంతు సొమ్ము పాత బకాయిలు తీర్చడానికే ఖర్చవుతున్నట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వెల్లడించింది. 2023–24 నుంచి ఈ పథకానికి బడ్జెట్‌ను పెంచకపోవడాన్ని తప్పుబట్టింది.
దేశంలో ద్రవ్యోల్బణం, గ్రామాల్లో పనులకు డిమాండ్ పెరుగుతున్నా నిధుల కేటాయింపులు ఆ స్థాయిలో పెరగకపోవడం సరైంది కాదని పేర్కొంది. ఉపాధి హామీ పథకంలో ప్రతిఏటా కనీస పని దినాలను 100 నుంచి 150కు పెంచాలని, కూలీలకు వేతనాలను నిజమైన ద్రవ్యోల్బణ సూచికకు అనుగుణంగా సవరించాలని స్టాండింగ్ కమిటీ ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ మేరకు ఒక నివేదిక సమరి్పంచింది.
పథకం ఉద్దేశం దెబ్బతింటోంది
ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో దాదాపు రూ.86 వేల కోట్లు కేటాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పెండింగ్ వేతనాలు రూ.12,219.18 కోట్లు, పెండింగ్ మెటీరియల్ ఖర్చులు రూ.11,227.09 కోట్లు ఉన్నాయి. అంటే రూ.23,446.27 కోట్ల బకాయిలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇవి ఏకంగా 27.26 శాతం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పనులకు ఖర్చు చేయడానికి రూ.62,553.73 కోట్ల నిధులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. పాత బకాయిల భారం వల్ల పథకం ఉద్దేశం దెబ్బతింటోందని పార్లమెంటరీ కమిటీ ఆక్షేపించింది.
ఈ పథకం కింద చెల్లిస్తున్న వేతనాల విషయంలో రాష్ట్రాల మధ్య విపరీతమైన వ్యత్యాసం ఉంటోందని పేర్కొంది. కనీస వేతనాలు చాలా తక్కువగా ఉండటంతో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం గ్రామాల నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది. వేతనాలను లెక్కించేందుకు పాటిస్తున్న విధానం ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని సరిగ్గా ప్రతిబింబించడం లేదని, కొత్త సూచిక అవసరమని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన వేతన రేటు అమలు చేసే అవకాశాలు కూడా పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.
పనుల విస్తరణ.. పనిదినాల పెంపు
ఉపాధి హామీ పథకంలో కూలీలకు కల్పించే పనుల రకాలను విస్తరించడం ద్వారా సంవత్సరానికి కనీస పని దినాలను 150కి పెంచే అవకాశం ఉందని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చి 17 ఏళ్లు గడిచినా.. పథకంలో గణనీయమైన మార్పులు చేర్పులు చేయలేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. వేతనాల చెల్లింపుల కోసం ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్‌ను తప్పనిసరి చేయొద్దని స్పష్టం చేసింది. ఇలాంటి చెల్లింపుల వ్యవస్థఅమల్లోకి వస్తే గ్రామీణ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది.