
పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగిన ఆందోళనలు, నిరసనలు
ప్లకార్డులు ప్రదర్శించే వారిపై చర్యలుంటాయని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారని మండిపాటు
అయినా వెనక్కి తగ్గని ప్రతిపక్ష ఎంపీలు
లోక్‌సభ, రాజ్యసభ గురువారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో వరుసగా మూడో రోజు బుధవారం సైతం విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు కొనసాగాయి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఢిల్లీలో మురికివాడల కూల్చివేత, బెంగాలీ వలస కారి్మకుల పట్ల వివక్ష వంటి అంశాలపై వెంటనే చర్చ చేపట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
సభకు సహకరించాలని కేంద్రం పదేపదే విజ్ఞప్తి చేసినా వినిపించుకోకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు బిగ్గరగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. వారిపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సభలో ఎంపీలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల ఆకాంక్షలను వెల్లడించాలి. ఇలా నిరసనలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదు.
ఇది పార్లమెంటరీ విధానం కాదు. ఎంపీల ప్రవర్తనను దేశమొత్తం గమనిస్తోంది. సభా మర్యాదను కాపాడండి. వీధుల్లో చేయాల్సిన ప్రదర్శనలు సభలో చేస్తున్నారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించే సభ్యులపై నిర్ణయాత్మక చర్య తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. అయినా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభ తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ అదే తీరు
రాజ్యసభలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సహా పలు కీలక అంశాలపై చర్చకు ఇచి్చన వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని కోరినా విపక్షాలు వినిపించుకోలేదు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమయ్యాక ప్రశ్నోత్తరాలు చేపట్టినా విపక్షాల ఆందోళన, నిరసనలతో 2 గంటల వరకు, తర్వాత గురువారానికి వాయిదా పడింది.
నల్ల దుస్తులతో నిరసన
తమ డిమాండ్లపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాల్సిందేనని తేల్చిచెబుతూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంట్ మకరద్వారం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన(ఉద్ధవ్), జేఎంఎం, ఆర్‌జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలు పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి‘, ‘ఓటు బందీని ఆపండి‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చాలామంది ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తంచేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై 28న ప్రత్యేక చర్చ
ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 28న లోక్‌సభలో, 29న రాజ్యసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. దిగువ సభలో ఈ అంశంపై 16 గంటలపాటు చర్చ జరపడానికి ఈ నెల 21న జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బుధవారం జరిగిన రాజ్యసభ బీఏసీ సమావేశంలోనూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో భారత సైన్యం దాదాపు ఆరు యుద్ధ విమానాలు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు బహిర్గతం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో తొలుత లోక్‌సభలో సుదీర్ఘంగా చర్చ జరుగుతుందని, ఆ తర్వాత రాజ్యసభలో చర్చ ప్రారంభిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోదీ ఈనెల 28వ తేదీ కల్లా స్వదేశానికి తిరిగివస్తారు.