
ఇందులో అమెరికా, చైనా తయారీ విమానాలున్నాయి
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో ప్రత్యర్థి దేశం పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలిందని, భారీగా నష్టపోయిందని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్తాన్‌కు చెందిన 12 నుంచి 13 ఫైటర్ జెట్లు కూల్చివేశామని, ఇందులో అమెరికాలో తయారైన ఎఫ్–16 యుద్ధ విమానాలు, చైనాలో తయారైన జేఎఫ్–17 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
భారత యుద్ధ విమానాలను పాక్ సైన్యం కూల్చివేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ ‘మనోహరమైన కథలు’ అంటూ కొట్టిపారేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో అమర్‌ప్రీత్ సింగ్ మాట్లాడారు. పాకిస్తాన్ భూభాగంలోకి 300 కిలోమీటర్లకుపైగా చొచ్చుకెళ్లి మరీ దాడి చేశామని, మన వైమానిక దళం ఇప్పటిదాకా సాధించిన వాటిలో ఇది ‘లాంగెస్ట్ కిల్’ అని పేర్కొన్నారు.
దూరంగా ఉన్న శత్రువును దెబ్బకొట్టామని, ఇది ఈ సంవత్సరానికే ‘హైలైట్’ అని అభివరి్ణంచారు. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌కు వాటిల్లిన నష్టంపై భారత వైమానిక దళం అధినేత స్పష్టమైన వివరాలు బయటపెట్టడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలంలో కొన్ని, భూభాగంపై మరికొన్ని ఫైటర్‌జెట్లను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. వీటిలో ఎఫ్–16లు, జేఎఫ్–17లతోపాటు ఒక నిఘా విమానం కూడా ఉందని వెల్లడించారు.
పాక్ రాడార్ వ్యవస్థలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్‌వేలు, హ్యాంగర్లపై అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు చేశామన్నారు. నాలుగు ప్రాంతాల్లో పాక్ రాడార్లు, రెండుచోట్ల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, మూడు హ్యాంగర్లు, రెండు రన్‌వేలు, ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్ ధ్యంసమయ్యాయని వివరించారు. మే 10వ తేదీన పాకిస్తాన్‌కు ఊహించని నష్టం జరిగిందన్నారు. దాంతో దిక్కుతోచని పాక్ సైన్యం కాల్పుల విరమణ కోసం భారత్‌ను వేడుకుందని పేర్కొన్నారు.
కాల్పులు తక్షణమే ఆపాలంటూ మనల్ని అభ్యరి్థంచే స్థాయికి పాకిస్తాన్‌ను తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెషబాజ్ షరీఫ్ కొన్నిరోజుల క్రితం ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతూ... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన ఏడు యుద్ధ విమానాలు కూల్చివేశామని చెప్పుకొచ్చారు. కానీ, దానిపై ఎలాంటి సాక్ష్యాధారాలను ఆయన బయటపెట్టలేకపోయారు. దీనిపై అమర్‌ప్రీత్ సింగ్ స్పందించారు. 15 భారత యుద్ధ విమానాలు కూల్చామని కూడా పాక్ చెప్పుకోవచ్చని.. వారు అలాగే భావిస్తూ సంతోషపడనివ్వండి అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
‘సుదర్శన్ చక్ర’తో పటిష్ట రక్షణ
ఆపరేషన్ సిందూర్‌తో మన వైమానిక దళం సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచి్చందని అమర్‌ప్రీత్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ‘సుదర్శన్ చక్ర’ పేరిట శత్రుదుర్భేద్యమైన గగనతల రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నామని వెల్లడించారు. 2035 నాటికి ఈ నూతన భద్రతా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ‘సుదర్శన్ చక్ర’ కోసం త్రివిధ దళాలు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాయని వివరించారు. దీనితో మన దేశంలోని కీలకమైన వ్యవస్థలకు పటిష్టమైన రక్షణ లభిస్తుందన్నారు. మరోసారి భారత్‌వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌ను హెచ్చరించారు.