
న్యూఢిల్లీ: 1947.. ఆగస్టు 14.. అది భారత ఉపఖండం చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఆ రోజున భారతదేశ విభజన జరిగింది. పాకిస్తాన్ పేరుతో ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం ఉద్భవించింది. నాటి దేశ విభజన కోట్లాదిమంది జీవితాలను శాశ్వతంగా మార్చివేసింది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దేశంలో భారీ స్థాయిలో మత అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు దక్షిణాసియా భౌగోళిక స్వరూపాన్ని , చరిత్రను మార్చివేశాయి.
1947లో దేశ విభజన సమయంలో నిరాశ్రయులైన లక్షలాది మంది పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకునేందుకు భారత్ ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ‘విభజన భయానక స్మృతి దినం’ను పాటిస్తుంది. 1947లో బ్రిటిష్ వలస పాలకులు భారతదేశాన్ని విభజించారు. అదే ఏడాది ఆగస్టు 14 న భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ కరాచీకి వెళ్లారు. అక్కడ ఆయన పాకిస్తాన్ రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. కరాచీని కొత్త దేశపు రాజధానిగా ప్రకటించారు. తరువాత ఇస్లామాబాద్‌ను రాజధానిగా మార్చారు. పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్‌గా ముహమ్మద్ అలీ జిన్నా ప్రమాణ స్వీకారం చేశారు.
విభజన అధికారిక ప్రకటనకు ముందుగానే, పెద్ద ఎత్తున వలసలు, మత హింస చోటుచేసుకుంది. లక్షలాది మంది హిందువులు, సిక్కులు, ముస్లింలు కొత్తగా విభజితమైన దేశాలలో భద్రత కోసం తమ స్థానాన్ని వెతుక్కోవలసి వచ్చింది. ఆగస్టు 14న పాకిస్తాన్ తన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా, మరుసటి రోజు ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 2021లో తన రెండవ పదవీకాలంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 14న ‘విభజన భయానక స్మృతి దినం’గా పాటించాలని ప్రకటించారు. విభజన సమయంలో నాటి ప్రజలు అనుభవించిన బాధలను భవిష్యత్ తరాలకు గుర్తుచేసేందుకు ఆగస్టు 14న విభజన భయానక స్మృతి దినంగా పాటిస్టున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ జారీ చేసింది.