
అంతర్జాతీయ మీడియా, నిపుణుల వెల్లడి
‘ఆపరేషన్ సిందూర్’ మైలురాయి: రక్షణ శాఖ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్‌కు అలా ఇలా తగల్లేదు. మన ప్రతి దాడుల దెబ్బకు దాయాది ఏకంగా మూడో వంతు వైమానిక శక్తిని కోల్పోయింది! ఆ నష్టాల తాలూకు పూర్తి వివరాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. మన బ్రహ్మోస్ తదితర క్షిపణులు పాక్‌లోని 11 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడడం తెలిసిందే. వాటి ధాటికి అవి కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలతో పాటు రక్షణ నిపుణులు తేల్చారు.
‘‘పాక్ వైమానిక స్థావరాల్లోని కీలక వ్యవస్థలన్నీ భారీగా దెబ్బతిన్నాయి. పాక్ ఎంతోకాలంగా మిడిసిపడుతున్న ఎఫ్ 16, జేఎఫ్ 17 వంటి అత్యాధునిక అమెరికా, చైనా తయారీ యుద్ధ విమానాల్లో చాలావరకు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి’’ అని వెల్లడించారు. సైనిక ఆపరేషన్లలో స్వావలంబన ప్రస్థానంలో ఆపరేషన్ సిందూర్‌ను మైలురాయిగా రక్షణ శాఖ అభివర్ణించింది. భారత రక్షణ పాటవానికి, ఆ రంగంలో సాధించిన స్వావలంబనకు ప్రతీకగా నిలిచిందని పేర్కొంది.
‘‘సరిహద్దులు దాటకుండానే పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలతో పాటు ఆ దేశ నలుమూలల్లోని కీలక సైనిక, వైమానిక వ్యవస్థలను కూడా తుత్తునియలు చేసి చూపించాం. పాక్ మాత్రం సైనికపరంగా కేవలం విదేశీ సాయాన్నే నమ్ముకుంది. మనపై దాడులకు చైనా తయారీ పీఎల్–15, తుర్కియేకు చెందిన ‘యిహా’ డ్రోన్లు, యూఏవీలను వాడింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ద్వారా తిరుగులేని రుజువులను ప్రపంచానికి చూపించాం’’ అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఐఏఎఫ్ చీఫ్‌దే కీలకపాత్ర
పాక్ వైమానిక స్థావరాలపై మన దాడుల్లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్‌సింగ్‌దే కీలక పాత్ర. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ దాడులు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. ముఖ్యంగా అతి కీలకమైన రావల్పిండిలోని చక్లాలా (నూర్ ఖాన్) ఎయిర్‌బేస్‌పై దాడి ప్లానింగ్ పూర్తిగా ఆయనదే. ఆ దాడిలో పాల్గొన్న పైలట్ల ఎంపిక తదితరాలను కూడా సింగ్ స్వయంగా ఎంపిక చేశారు. శనివారం తెల్లవారుజామున చక్లాలాలో మూడు ప్రాంతాలపై మన క్షిపణులు విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించాయి. వాటి దెబ్బకు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ మూడు గంటలు బంకర్లో తలదాచుకోవడమే గాక తన నివాసాన్ని సురక్షిత ప్రాంతానికి మార్చేశారట!
నేవీ త్రిముఖ వ్యూహం
పాక్‌పై మన దాడుల సందర్భంగా నేవీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి పాక్‌ను అష్టదిగ్బంధం చేసేసింది. అందులో భాగంగా పాక్‌కు జీవనాడి వంటి కరాచీ ఓడరేవుపై మన ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక పూర్తిస్థాయిలో గురిపెట్టింది. ఏకంగా 36 నావికా దళాలను మోహరించింది. ఏడు డి్రస్టాయర్లు, ఐఎన్‌ఎస్ తుషిన్ వంటి యుద్ధనౌకలు వాటిలో ఉన్నాయి. అవన్నీ బ్రహ్మోస్, ఎంఆర్‌ఎస్‌ఏఎం తదితర క్షిపణులను ఎక్కుపెట్టి ఏ క్షణమైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచాయి. అంతేగాక వరుణాస్త్ర వంటి అత్యాధునిక టార్పెడోలతో జలాంతర్గాములను కూడా ఐఎన్‌ఎస్ విక్రాంత్ పూర్తిగా సన్నద్ధం చేసింది. దాంతో మరో దారిలేక పాక్ నేవీ కేవలం పోర్టుకే పరిమితం కావాల్సి వచ్చింది.
నవాజ్ కనుసన్నల్లోనే...!
భారత్‌పై పాక్ సైనిక చర్యలను పూర్తిగా ప్రధాని షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫే పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. మనపై దాడులన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగినట్టు సమాచారం. నవాజ్ మూడుసార్లు పాక్ ప్రధానిగా చేశారు. ప్రస్తుతం అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) సారథి. 1999లో ఆయన ప్రధానిగా ఉండగానే కార్గిల్ యుద్ధం జరిగింది. మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం, పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేయడం తెలిసిందే. ఆ మర్నాడు షహబాజ్ ఏర్పాటు చేసిన కీలక భేటీలో ప్రభుత్వపరంగా ఏ హోదా లేని నవాజ్ కూడా పాల్గొన్నారు.
మా మద్దతు పాక్‌కే: తుర్కియే
అంతర్జాతీయంగా ఛీత్కారాలు ఎదురవుతున్నా తుర్కియే బుద్ధి మాత్రం మారడం లేదు. అన్నివేళలా పాక్‌కే మద్దతుగా ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ బుధవారం కుండబద్దలు కొట్టారు. ‘‘పాక్ మా నిజమైన మిత్రదేశం. మా దేశాల సోదర భావం నిజమైన స్నేహానికి నిదర్శనం. పాక్–తుర్కియే దోస్తీ జిందాబాద్!’’ అని చెప్పుకొచ్చారు.