న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు.. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు పట్టుకున్న టెర్రర్ మాడ్యూల్‌కు మధ్య ఉన్న లింక్ బయటపడింది. పేలుడు జరిగిన కారు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన ఒక వైద్యుడిదని, అతను మాడ్యూల్‌లో భాగమని మంగళవారం తెల్లవారుజామున ఉన్నత వర్గాలు ధృవీకరించాయని ‘ఎన్‌డీటీవీ’ వెల్లడించింది. ఈ పేలుడును ప్రాథమికంగా ఉగ్రవాద దాడిగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని 16,18 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. దీనికితోడు హత్య, హత్యాయత్నం అభియోగాలతో పాటు పేలుడు పదార్థాల చట్టంలోని 3, 4 సెక్షన్‌లను కూడా జోడించారు.
గత కొన్ని రోజులుగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్‌లను దర్యాప్తు అధికారులు అరెస్టు చేసి 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో కారు యజమాని డాక్టర్ ఉమర్ మొహమ్మద్ భయాందోళనకు గురై ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారణమయ్యాడని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎర్రకోట నుంచి కారు నగర ముఖ్య కేంద్రం వైపు వెళుతున్నట్లు కనిపిస్తుండటంతో లక్ష్యం మధ్య ఢిల్లీలో ఎక్కడైనా ఉండవచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఎర్రకోట ఉగ్రదాడిలో పెద్ద మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించారని పోలీసులు, నిఘా సంస్థలు భావిస్తున్నాయి. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు ఫరీదాబాద్‌లోని రెండు ఇళ్ల నుండి వేల కిలోల అనుమానిత పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ రెండు ఇళ్లను డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అద్దెకు తీసుకున్నారు.
పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా విలేకరులతో మాట్లాడుతూ.. నెమ్మదిగా కదులుతున్న వాహనం రెడ్ లైట్ వద్ద ఆగిపోయిందని, ఆ వాహనంలో పేలుడు సంభవించిందన్నారు. పేలుడు కారణంగా సమీపంలోని వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.
ఢిల్లీ పోలీసులు, జమ్ముకశ్మీర్ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్టీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, యుపీ ఎటీఎస్, హర్యానా పోలీసులు, గుజరాత్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాల సంయుక్త నేతృత్వంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. పుల్వామాలో తారిక్ అనే వ్యక్తిని జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో దాడిలో ఉపయోగించిన వాహనం అనేకసార్లు చేతులు మారిందని తెలుస్తోంది. కారును తొలుత అమీర్ అనే వ్యక్తికి విక్రయించారు. తరువాత తారిక్‌కు, చివరకు ఉమర్‌కు అప్పగించారు. విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ఢిల్లీ ఘటన: కారులో ‘ముసుగు మనిషి’


