
ఉగ్రవాదులకు సురక్షిత స్థానం ఎక్కడా లేదని నిరూపించాం
ప్రధానమంత్రి మోదీ స్పష్టీకరణ
రాజేంద్ర చోళ–1 జయంతి వేడుకలకు హాజరైన ప్రధాని
గంగైకొండ చోళపురం: భారతదేశ శక్తి సామర్థ్యాలు ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి తెలిసొచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు, మన శత్రువులకు సురక్షిత స్థానం అంటూ ఎక్కడా లేదన్న నిజాన్ని నిరూపించామని చెప్పారు. మన సార్వభౌమత్వంపై దాడి జరిగితే ప్రతిస్పందన ఎంత భీకరంగా ఉంటుందో అందరికీ తెలిసిపోయిందని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ దేశ ప్రజలకు నూతన ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని స్పష్టంచేశారు. ఆదివారం తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో చొళరాజు రాజేంద్ర చోళ–1 జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
‘ఆది తిరువత్తిరై’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. రాజరాజ చోళ, ఆయన కుమారుడు రాజేంద్ర చోళ–1 చక్రవర్తుల పేర్లు మన దేశ గుర్తింపునకు పర్యాయపదాలు అని కొనియాడారు. వారు మనందరికీ గర్వకారణమని చెప్పారు. తమిళనాడులో భారీ ఎత్తున వారి విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మన చరిత్రకు అవి దర్పణాలు అవుతాయని నరేంద్ర మోదీ అన్నారు. సాధారణంగా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు యూకేలోని మాగ్నాకార్టా గురించి మాట్లాడుతుంటారని, నిజానికి వెయ్యి సంవత్సరాల క్రితమే చోళుల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో ఉందని గుర్తుచేశారు.
బృహదీశ్వర ఆలయంలో పూజలు
గంగైకొండ చోళపురంలో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోదీ సంప్రదాయ వస్త్రాలు ధరించి, పవిత్ర జలంలో కూడిన కలశం చేతబూని ఆలయంలోకి ప్రవేశించారు. గర్భాలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన చేశారు. అనంతరం భారత పురావస్తు సర్వే విభాగం నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. అంతకముందు గంగైకొండ చోళపురంలో ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. రహదారికి ఇరువైపులా జనం బారులు తీరి ఆయనకు స్వాగతం పలికారు. 3 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్ షోలో బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీల జెండాలు రెపరెపలాడాయి.
ప్రధానితో పళని స్వామి భేటీ
తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో శనివారం రాత్రి ఏఐఏడీఎంకే ప్రధా న కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి సమావేశమయ్యారు. తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్‌లో ఈ భేటీ జరిగింది. తమిళనాడులో బీజేపీ, ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కుదిరిన తర్వాత మోదీ, పళనిస్వామి కలుసుకోవడం ఇదే మొదటిసారి. రాబోయే అసెంబ్లీ ఎ న్నికలపై వారు చర్చించుకున్నట్లు సమాచారం
దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గొప్ప దార్శనికుడిగా, శాస్త్రవేత్తగా, గురువుగా, దేశభక్తుడిగా కలాం చిరస్మరణీయులు అని మోదీ కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి చేసుకొనే దిశగా కలాం ఆలోచనలు, ఆశయాలు యువతకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు.
కలాంకు మోదీ నివాళులు