
న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ ఎంత నాసిరకంగా ఉందో కేంద్ర విద్యాశాఖ సర్వేలో తేటతెల్లమయ్యింది. మూడో తరగతి చదువుకున్న విద్యార్థుల్లో 55 శాతం మంది మాత్రమే ఒకటి నుంచి 99 వరకు అంకెలను ఆరోహణ, అవరోహణ క్రమంలో అమర్చగలరు. ఆరో తరగతి చదువుతున్న వారిలో కేవలం 53 శాతం మందికే ఒకటి నుంచి పది దాకా ఎక్కాలు వచ్చు. గత ఏడాది డిసెంబర్ 4న ఈ సర్వే నిర్వహించారు. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన 781 జిల్లాల్లో 74,229 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21.15 లక్షల మంది విద్యార్థులను ప్రశ్నించారు.
వీరిలో మూడు, ఆరు, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో 58 శాతం మంది కూడికలు, తీసివేతలు చేయగలరని తేలింది. మూడో తరగతి, ఆరో తరగతిలో గణితం సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బాగా వెనుకబడి ఉన్నట్లు వెల్లడయ్యింది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తున్నట్లు సర్వేలో గుర్తించారు.
అలాగే అన్ని తరగతుల విద్యార్థులు లాంగ్వేజ్(భాష)లో ఎక్కువ, గణితంలో అతి తక్కువ మార్కులు సాధిస్తున్నారు. విద్యార్జన విషయంలో రూరల్–అర్బన్ అనే వ్యత్యాసం కూడా కనిపిస్తోంది. గ్రామాల్లోని మూడో తరగతి విద్యార్థులు మ్యాథ్స్, లాంగ్వేజ్‌లో పట్టణాల్లోని విద్యార్థుల కంటే ఎక్కువగా రాణిస్తున్నారు. పట్టణాల్లోని ఆరు, తొమ్మిది తరగతి విద్యార్థులు దాదాపు అన్ని సబ్జెక్టుల్లో పల్లెల్లోని విద్యార్థుల కంటే మిన్నగా చదువుతున్నారు.