
కర్ణాటక: వివాహేతర సంబంధం వద్దని దండించిన భర్తను, ప్రియునితో కలిసి హతమార్చిందో భార్య. ఈ కేసులో భార్యతో పాటు ప్రియునికి జీవితఖైదును విధిస్తూ హోసూరు కోర్టు జడ్జి సంతోష్ తీర్పు చెప్పారు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా ఉణిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప (37), పికప్ వాహన డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. రైతుల పొలాల నుంచి కాయగూలను వాహనంలో మార్కెట్‌కు తీసుకెళ్లేవాడు. తనకు తోడుగా దూరపు బంధువైన మంచుగిరి గ్రామవాసి తంగమణి (24)ను తోడుగా తీసుకెళ్లేవాడు. తంగమణి తరచూ అయ్యప్ప ఇంటికెళ్లి వస్తుండేవాడు.
హత్య చేసి నాటకం
ఈ నేపథ్యంలో అయ్యప్ప భార్య రూప (29)తో తంగమణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకొన్న అయ్యప్ప భార్యను నిలదీశాడు. దీంతో అయ్యప్పను అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ కుట్ర చేశారు. 2021 అక్టోబరు 21వ తేదీన ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్న అయ్యప్పను గొంతుకోసి చంపారు. మత్తులో తానే గొంతు కోసుకొని చనిపోయాడని భార్య నాటకమాడింది. ఈ ఘటనపై డెంకణీకోట పోలీసులు తీవ్ర విచారణ జరుపగా అయ్యప్ప భార్య, ప్రియుని బండారం బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. నేరం రుజువు కావడంతో మంగళవారం సాయంత్రం జడ్జి సంతోష్ తీర్పు వెలువరించారు.