జ్వరం వచ్చిందని చిన్నారికి 40 చోట్ల వాతలు.. చివరకు.. | Odisha Infant Branded With Hot Iron 40 Times | Sakshi
Sakshi News home page

జ్వరం వచ్చిందని చిన్నారికి 40 చోట్ల వాతలు.. చివరకు..

Mar 4 2025 9:13 AM | Updated on Mar 4 2025 9:54 AM

Odisha Infant Branded With Hot Iron 40 Times

భువనేశ్వర్‌: ప్రపంచం ఇరవై ఒకటో శతాబ్దంలో ఓవైపు కృత్రిమ మేథతో దూసుకుపోతుంటే మరోవైపు కొందరు ఇంకా మూఢాంధకారంలో మగ్గిపోతున్నారు. తమ మూఢ విశ్వాసాలకు కుటుంబసభ్యులనూ బలిచేస్తున్నారు. ఒడిశాలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది.

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నెల వయసు పసికందుకు నిర్దాక్షిణ్యంగా వాతలు పెట్టారు. దాదాపు 40 చోట్ల వాతలతో నరకయాతన పడుతున్న చిన్నారిని ఎట్టకేలకు ఆస్పత్రిలో చేర్పించడంతో బతికి ప్రాణాలతో బయటపడ్డాడు. నబారంగ్‌పూర్‌ జిల్లాలోని చందహండీ బ్లాక్‌ గంభారీగూడ పంచాయతీ పరిధిలోని ఫూన్‌దేల్‌పాడా గ్రామంలో ఈ దారుణోదంతం జరిగింది. ప్రస్తుతం చిన్నారిని ఉమెర్‌కోట్‌ సబ్‌–డివిజనల్‌ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నామని నబారంగ్‌పూర్‌ చీఫ్‌ డి్రస్టిక్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ సోమవారం చెప్పారు.  

తలపై, పొట్టపై వాతలు.. 
నెలరోజుల క్రితం జన్మించిన ఈ బాబు గత పదిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఒళ్లు వేడెక్కి కాలిపోతుండటంతో గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పిల్లాడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సిన కుటుంబసభ్యులకు మూఢవిశ్వాసాలపై గురి ఎక్కువ. ఈ గ్రామీణ ప్రాంతంలో పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోతే చెడుగాలి సోకిందని, దుష్టశక్తిని పారద్రోలేందుకు ఉపాయంగా ఇనుప కడ్డీతో ఒంటిపై వాతలు పెడతారు. ఇదే అంధవిశ్వాసంతో కుటుంబసభ్యులు ఈ పిల్లాడికి తలపై, పొట్టపై దాదాపు 40 చోట్ల కాల్చిన ఇనుపకడ్డీతో వాతలు పెట్టారు. కాలిన గాయాలతో పిల్లాడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.

దీంతో చేసేదేమీలేక చివరకు పిల్లాడిని ఉమెర్‌కోట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పిల్లాడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చందహండీ బ్లాక్‌ పరిధిలో ప్రజల్లో మూఢవిశ్వాసాలను పోగొట్టి వారిలో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. వాతలు పెట్టే పురాతన పద్ధతులను విడనాడాలని అవగాహన కార్యక్రమాలు మొదలెట్టారు.   

Advertisement
 
Advertisement
Advertisement