నీట్‌ పరీక్షా సమయం పెంపు! | NTA has extended the duration of the Re-NEET UG 2026 examination | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షా సమయం పెంపు!

Jun 13 2026 5:21 AM | Updated on Jun 16 2026 11:16 AM

NTA has extended the duration of the Re-NEET UG 2026 examination

అదనంగా 15 నిమిషాలు పెంచిన ఎన్‌టీఏ 

మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష 

నాలుగుకు పెరగనున్న రఫ్‌ వర్క్‌ పేజీలు 

ఎడమ చేతివాటం విద్యార్థులకు అనుకూలంగా బుక్‌లెట్‌ డిజైన్‌ 

జూన్‌ 21న జరగనున్న నీట్‌ రీ–ఎగ్జామ్‌కు పక్కాగా ఏర్పాట్లు

సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరిగే నీట్‌ రీటెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలకమైన వెసులుబాట్లు కల్పీంచింది. పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్‌లెట్‌లో రఫ్‌ వర్క్‌ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్‌ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. 

ఇన్విజిలేషన్‌ ప్రక్రియలో భాగంగా హాజరు పట్టికలో సంతకాలు తీసుకోవడం లాంటివాటితో విద్యార్థులు పరీక్ష సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకే అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు ఎన్‌టీఏ వివరించింది. సమయం పెంపుతో పాటే రఫ్‌ వర్క్‌ కోసం ఇచ్చే పేజీల సంఖ్యను సైతం ఎన్‌టీఏ రెట్టింపు చేసింది. గతంలో ప్రశ్నాపత్రం బుక్‌లెట్‌ చివరన కేవలం రెండు పేజీలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు వాటి సంఖ్యను నాలుగుకు పెంచారు. భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం విభాగాల్లో గణాంకాలు, రేఖాచిత్రాల కోసం అభ్యర్థులకు మరింత స్థలం అందుబాటులోకి రానుంది. 

ముఖ్యంగా ఎడమ చేతివాటం ఉన్న అభ్యర్థులకు బుక్‌లెట్‌ చివరన ఉన్న పేజీల్లో రఫ్‌ వర్క్‌ చేసుకోవడం ఇబ్బందిగా మారుతోందన్న ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా బుక్‌లెట్‌ లేఅవుట్‌ను మార్చారు. ఇన్‌స్ట్రక్షన్స్‌ పేజీ తర్వాత ముందు భాగంలో రెండు పేజీలు, బుక్‌లెట్‌ చివరన మరో రెండు పేజీలను రఫ్‌ వర్క్‌ కోసం కేటాయించారు. ఈ కొత్త ఫార్మాట్‌ ఇంగ్లిష్, ఇతర అన్ని ప్రాంతీయ భాషల ప్రశ్నపత్రాలకు వర్తిస్తుంది. నీట్‌ రాసేవారిలో 10 శాతం మంది ఎడమచేతి వాటం వారు ఉన్నారని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షా విధానంలో తీసుకువచ్చిన ఈ చిన్న మార్పులు విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతాయని ఎన్‌టీఏ పేర్కొంది. పారదర్శకత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే పరీక్షను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డుల్లో ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదువుకుని పరీక్షా కేంద్ర సిబ్బందికి సహకరించాలని కోరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement