సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ నామినేషన్ రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఇవాళ ఊరట లభించలేదు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున తాము తక్షణ జోక్యం చేసుకోలేమని గురువారం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆమె పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత మీనాక్షి నాటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దు అంశం సుప్రీంకోర్టు ముందుకు చేరింది. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్నికల ఫలితాల ప్రకటనపై తాత్కాలిక నిలుపుదల (స్టే) ఇవ్వాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు ఈ దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.
అయితే మిగిలిన వాదనలు, వివరణలు శుక్రవారం వింటామని తెలిపింది. అలాగే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం సాధారణంగా తగదని అభిప్రాయం బలంగానే వ్యక్తి చేసింది. దీంతో ఈ కేసు రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.
మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు, రెండు ఉప స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (4), గుజరాత్ (4), కర్ణాటక (4) మధ్యప్రదేశ్ (3), రాజస్థాన్ (3), జార్ఖండ్ (2), మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో ఒక్కో స్థానం చొప్పున మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే.. మహారాష్ట్ర, తమిళనాడులో చెరో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.


