45 నిమిషాల పాటు ఎయిర్‌పోర్టులోనే ప్రధాని మోదీ | Neet Ug 2026 Re Exam: Pm Modi Waited At Delhi Airport For 45 Minutes | Sakshi
Sakshi News home page

45 నిమిషాల పాటు ఎయిర్‌పోర్టులోనే ప్రధాని మోదీ

Jun 21 2026 3:49 PM | Updated on Jun 21 2026 4:10 PM

Neet Ug 2026 Re Exam: Pm Modi Waited At Delhi Airport For 45 Minutes

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ విమానాశ్రయంలోనే 45 నిమిషాల పాటు ఉండిపోయారు. నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్‌ హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడటం కోసం ప్రధాని.. ఢిల్లీ విమానాశ్రయంలోనే కాసేపు వేచి ఉన్నారు.

పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తన తిరుగు ప్రయాణాన్ని కాస్త ఆలస్యం చేసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రధాని మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.

నీట్ (NEET) పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండటంతో ఆయన విమానాశ్రయం నుండి వెంటనే తన నివాసానికి బయలుదేరడానికి బదులుగా.. అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. విమానాశ్రయం నుండి ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిలిపివేస్తారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్‌తో విద్యార్థులు పరీక్షకు ఆలస్యం కాకూడదని.. పరీక్షా ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లారు.

దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్‌–యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఇవాళ (ఆదివారం) ప్రారంభమైంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్‌ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నేడు నీట్‌ రీఎగ్జామ్‌ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్‌–పేపర్‌ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement