కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు! | NEET Row Deepens: Cockroach Janta Party Makes Explosive Claims | Sakshi
Sakshi News home page

కాక్రోచ్‌ పార్టీ సంచలన ఆరోపణలు!

Jun 22 2026 1:59 PM | Updated on Jun 22 2026 2:26 PM

NEET Row Deepens: Cockroach Janta Party Makes Explosive Claims

నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారం, అవకతవకల నడుమ మరోసారి పరీక్షను నిర్వహించారు. అయితే దీనిపై కూడా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రం తీరును ఖండిస్తూ.. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు సంచలన ఆరోపణలకు దిగింది..  

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వివాదంపై కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, సోషల్‌ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన అభిజిత్‌ దీప్కే.. నిరసనకారుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతర్‌మంతర్‌లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. నిరసనలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు.

అంతేకాకుండా నిరసనకారులకు నీళ్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్న వారి ఆధార్‌ కార్డు వివరాలు, చిరునామాలు సేకరిస్తున్నారని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. ప్రజలకు సహాయం చేస్తున్న వారిని సైతం అనుమానాస్పదంగా చూడటం సరైంది కాదని అభిజిత్‌ పేర్కొన్నారు.

జంతర్‌మంతర్‌లో నిరసనకారుల కోసం స్వచ్ఛంద సంస్థలు, మద్దతుదారులు లంగర్‌ ఏర్పాటు చేసి ఆహారం, లస్సీ పంపిణీ చేస్తున్నారు. అనేక మంది రాత్రంతా అక్కడే బస చేస్తుండటంతో చెప్పులు, సామాన్లు, పాత్రలు అక్కడే కనిపిస్తున్నాయి. పోలీసులు అనుమతి గడువు ముగిసిందని తెలిపినా.. ప్రత్యామ్నాయ వేదిక కేటాయించే వరకు తాము నిరసన కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.

నీట్‌-యూజీ లీక్‌ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని కూడా ఈ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ ఉద్యమానికి తాజాగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

మరోవైపు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేశ్వర్‌ రఘునాథ్‌ థోరట్‌ఈ నిరసనల్లో చేరడం హైలైట్‌ అయ్యింది. “విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ కొందరి లాభం కోసం పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే అది లక్షలాది కుటుంబాలకు అన్యాయం చేసినట్టే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు రీ టెస్ట్‌ను కూడా ఎన్‌టీఏ సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జంతర్‌మంతర్‌ వేదికగా కొనసాగుతున్న నిరసనలు, కాక్రోచ్‌ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు మరోసారి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఉద్యమం ఇంకా ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement