మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో నీట్‌ సెంటర్‌ | Neet Re Test: Nagpur Student Ger Abu Dhabi NTA Says This | Sakshi
Sakshi News home page

మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్‌పూర్‌ విద్యార్థికి అబుదాబిలో నీట్‌ సెంటర్‌

Jun 20 2026 10:37 AM | Updated on Jun 20 2026 11:40 AM

Neet Re Test: Nagpur Student Ger Abu Dhabi NTA Says This

నీట్‌ రీటెస్ట్‌కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థికి ఊహించని షాక్‌ తగిలింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అభ్యర్థి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోగా.. పరీక్షా కేంద్రం ఏకంగా యూఏఈలోని అబుదాబిగా కనిపించింది. పాస్‌పోర్టే లేని విద్యార్థికి విదేశంలో పరీక్షా కేంద్రం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

రేపు(జూన్‌ 21న) జరగనున్న రీ-నీట్‌ యూజీ 2026 పరీక్ష కోసం నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్‌ తాలిబ్‌ అడ్మిట్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. అయితే అందులో పరీక్షా కేంద్రంగా భారత్‌లోని నగరం కాకుండా.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) రాజధాని అబుదాబిలోని ఓ భారతీయ పాఠశాల పేరు కనిపించింది. నాగ్‌పూర్‌ నుంచి దరఖాస్తు చేసుకున్న తాను విదేశీ పరీక్షా కేంద్రం ఎలా పొందానని విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

పాస్‌పోర్టే లేదు.. పరీక్ష ఎలా?..
ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అబ్దుల్లా వద్ద పాస్‌పోర్టు కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అబుదాబికి వెళ్లి పరీక్ష రాయడం అసాధ్యమని పేర్కొన్నారు. అడ్మిట్‌ కార్డులోని వివరాల స్క్రీన్‌షాట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.

ఎన్‌టీఏ స్పందన
ఈ విషయాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు వెంటనే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఇది టెక్నికల్‌ గ్లిచ్‌ (సాంకేతిక లోపం) కారణంగా జరిగిందని అంగీకరించినట్లు సమాచారం. అలాగే తప్పును సరిదిద్ది, సరైన పరీక్షా కేంద్రంతో కొత్త అడ్మిట్‌ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎన్‌టీఏ నుంచి ఈ-మెయిల్‌ కూడా వచ్చినట్లు వెల్లడించారు.

ఇదేకాదు.. రేపటి రీటెస్ట్‌ నేపథ్యంలో ఎన్‌టీఏ నిర్లక్ష్యం బయటపడుతోంది. హాల్‌ టికెట్స్‌, ఎగ్జామ్‌ టైమింగ్‌.. సెంటర్లలో గందరగోళం నెలకొంది. మరో విద్యార్థికి సాయంత్రం 4గం.ఎగ్జామ్‌ అని సమాచారం. అయితే కంగారుపడక్కర్లేదంటూ ఆయా విద్యార్థులకు ఎన్‌టీఏ సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. 

నీట్‌ యూజీ పరీక్ష కోసం విదేశాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, NRIలు, OCI అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. గత కొన్నేళ్లుగా అబుదాబి, దుబాయ్, దోహా, కువైట్ సిటీ, మస్కట్, మనామా, రియాద్, షార్జా, సింగపూర్, కౌలాలంపూర్ వంటి నగరాల్లో NEET పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.నాగ్‌పూర్‌లో దరఖాస్తు చేసిన విద్యార్థికి పొరపాటున అబుదాబి కేంద్రం కేటాయించడమే ఈ వివాదానికి కారణమైంది.

జూన్‌ 21న రీ-నీట్‌
పేపర్‌ లీకేజీ నేపథ్యంలో రద్దైన నీట్‌ పరీక్షను.. రేపు మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పెన్‌-అండ్‌-పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్‌ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం తదితర అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఎన్‌టీఏ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మాక్‌డ్రిల్‌ కూడా నిర్వహించబోతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement