యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం | NEET re-exam 2026 Uttar Pradesh govt announces 50% bus fare concession | Sakshi
Sakshi News home page

యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం

Jun 17 2026 12:57 PM | Updated on Jun 17 2026 1:19 PM

NEET re-exam 2026 Uttar Pradesh govt announces 50% bus fare concession

లక్నో: నీట్‌ రీఎగ్జామ్‌పై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్‌ 21న నీట్ రాసే విద్యార్థులకు బస్సు టికెట్లలో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు అడ్మిట్‌ కార్డు చూపించి ఈ సేవలు పొందవచ్చని తెలిపింది. విద్యార్థులు  మరోసారి నీట్ ఎగ్జామ్‌ రాస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

జూన్ 21న  నీట్‌ రీఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఈ రోజు (బుధవారం) అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. నీట్ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) బస్సు ఛార్జీలలో 50 శాతం రాయితీని యోగి  ప్రకటించారు. ఎన్‌టీఏ ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి సదుపాయాలతో పాటు పరీక్ష కేంద్రాలకు సరైన సమాయానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నిశితంగా పర్యవేక్షించాలని, పరీక్షకు సంబంధించిన వదంతులు, తప్పుడు సమాచారం లేదా తప్పుదారి పట్టించే కంటెంట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలి. నీట్ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగాలు, పోలీసు అధికారులు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో దాదాపుగా దాదాపు 3.5 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం నేపథ్యంలో వారందరికీ మేలు చేకూరనుంది.

టెలిగ్రామ్‌ బ్యాన్‌  

కాగా నీట్ పరీక్ష కోసం కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేదం విధించింది. జూన్‌ 22వరకూ టెలిగ్రామ్‌ యాక్సెస్‌ నిషేదించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్‌లోని ఎడిట్‌ ఆఫ్షన్‌ తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. పేపర్‌ లీక్‌ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.  

అదేవిధంగా  నీట్‌ రీటెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా సమయాన్ని పెంచడంతో పాటు బుక్‌లెట్‌లో రఫ్‌ వర్క్‌ చేసుకునేందుకు అదనపు పేజీలను కేటాయించింది. గతంలో నీట్‌ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజా నిర్ణయంతో ఈ సమయాన్ని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది.

పెంచిన సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో పరీక్షలో ఎలాంటి మోసాలకు తావు లేకుండా కీలక చర్యలు తీసుకుంటుంది. కాగా ఇటీవల ప్రశ్నాపత్రాల తరలింపుకు విమానాలను వాడింది. ఒక పరీక్ష పత్రాలకోసం విమాన సేవలను వినియోగించుకోవడం దేశంలోనే ఇది తొలిసారి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement