రాబోయే దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి, మహా నవమి పూజల తేదీలపై భక్తుల్లో గందరగోళం నెలకొంది. అష్టమి వ్రతం ఎప్పుడు చేయాలి? కుమారీ పూజ ఏ రోజు నిర్వహించాలి? నవమి పూజకు సరైన సమయం ఏది? అనే సందేహాలకు పండితులు సరైన శుభ సమయాలు తెలియజేశారు. 2026లో శారదా నవరాత్రులు అక్టోబర్ 11న ప్రారంభమై, అక్టోబర్ 20న విజయదశమితో ముగుస్తాయి.
అక్టోబర్ 19న దుర్గాష్టమి
అష్టమి తిథి అక్టోబర్ 18న ఉదయం 8:27 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 19న ఉదయం 10:51 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అక్టోబర్ 19నే అష్టమిగా పరిగణిస్తారు. అందువల్ల ఆ రోజున అష్టమి వ్రతం, ప్రత్యేక పూజలు, హోమాలు, కుమారి పూజ నిర్వహించవచ్చు. ఈ రోజు దుర్గాదేవి ఎనిమిదో రూపమైన మహాగౌరి అమ్మవారిని పూజిస్తారు.
కుమారి పూజకు అష్టమి సమయం
అష్టమి సందర్భంగా కుమారి పూజ నిర్వహించే వారు అక్టోబర్ 19న చేయవచ్చు. వీలైనంత వరకు అష్టమికి సంబంధించిన పూజలు, కుమారి పూజను ఉదయం 10:51 గంటలకు ముందే పూర్తి చేయాలని పండితులు సూచించారు. అయితే కొన్ని కుటుంబాల్లో దుర్గాష్టమి పూజను రాత్రివేళ నిర్వహించే సంప్రదాయం ఉంది. అలాంటి వారు అక్టోబర్ 18 రాత్రి అష్టమి తిథి ప్రారంభమైన తర్వాత తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం పూజ చేయవచ్చు.
10:51 తర్వాత మహానవమి
అక్టోబర్ 19న ఉదయం 10:51 గంటలకు అష్టమి ముగిసి, వెంటనే నవమి తిథి ప్రారంభమవుతుంది. దీంతో అదే రోజు ఉదయం 10:51 గంటల తర్వాత మహానవమి పూజ, హోమాలు, కుమారిపూజ నిర్వహించవచ్చు. అంటే అక్టోబర్ 19న అష్టమి, నవమి రెండింటికీ సంబంధించిన కుమారిపూజ చేసే అవకాశం ఉంది.
అక్టోబర్ 20న కూడా నవమి పూజ
ఉదయ తిథికి ప్రాధాన్యం ఇచ్చేవారు అక్టోబర్ 20న కూడా మహానవమి పూజ, కుమారిపూజ చేసుకోవచ్చు. అయితే ఆ రోజు నవమి తిథి మధ్యాహ్నం 12:50 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అక్టోబర్ 20న నవమి పూజ, హోమాలు లేదా కుమారిపూజ చేసేవారు మధ్యాహ్నం 12:50 గంటలలోపు పూర్తి చేయాలి. మహానవమి వ్రతం పాటించేవారు అక్టోబర్ 19న ఉపవాసం ఉండి, దుర్గాదేవిని పూజించి, మరుసటి రోజు విజయదశమి నాడు వ్రతాన్ని విరమించవచ్చని పండితులు పేర్కొన్నారు.
సంధి పూజకు 48 నిమిషాలు
2026లో సంధి పూజకు అక్టోబర్ 19న ఉదయం 10:27 నుంచి 11:15 గంటల వరకు సమయం ఉంది. మొత్తం 48 నిమిషాల ఈ కాలంలో అష్టమి చివరి 24 నిమిషాలు, నవమి ప్రారంభమైన తొలి 24 నిమిషాలు ఉంటాయి. ఈ సమయాన్నే సంధి కాలంగా పరిగణించి పూజ నిర్వహిస్తారు. మత నమ్మకాల ప్రకారం ఈ సమయంలో దుర్గాదేవి చాముండి రూపంలో చండ, ముండ అనే రాక్షసులను సంహరించిందని చెబుతారు. అందుకే సంధి పూజలో చాముండి రూపంలో అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు.
ఇదీ చదవండి: ప్రజాసేవలో 25 ఏళ్లు.. విఘ్నేశునికి ప్రధాని మోదీ పూజలు


