జీపీఎస్ ట్రాకింగ్, 112తో అనుసంధానం
ఏఐఎస్–25 ప్రమాణాలు తప్పనిసరి
విడుదల చేసిన ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అంబులెన్స్ సేవల (ఎన్‌ఏఎస్)–2026 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను ఒకే ప్రమాణాలతో నిర్వహించేందుకు తొలిసారిగా సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
సోమవారం ఢిల్లీలో జరిగిన 16వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ సమావేశంలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయన ఆవిష్కరించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సకాలంలో, సురక్షితమైన, నాణ్యమైన వైద్య రవాణా సేవలు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి నడ్డా పేర్కొన్నారు.
సమన్వయం కోసం ఐసీడీసీలు
మార్గదర్శకాల ప్రకారం అన్ని అంబులెన్స్‌లు తప్పనిసరిగా ‘ఏఐఎస్–125’ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అంబులెన్స్‌ల వర్గీకరణ, జనాభా ఆధారంగా వాహనాల కేటాయింపు, సిబ్బంది నియామకాలు, అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులకు శిక్షణ, అవసరమైన పరికరాలు, మందులు, వాహనాల నిర్వహణ, నాణ్యత నియంత్రణ, పనితీరు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలను ఇందులో నిర్దేశించారు. అత్యవసర సేవల సమన్వయం కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ డిస్పాచ్ సెంటర్లు (ఐసీడీసీలు) ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి సూచించారు.
జీపీఎస్ ఆధారిత అంబులెన్స్ ట్రాకింగ్, డిజిటల్ కాల్ మేనేజ్‌మెంట్, రియల్‌టైమ్ పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడంతో పాటు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అంబులెన్స్ సేవలను ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్ 112తో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే జీఐఎస్ సాంకేతికత ఆధారంగా ఆసుపత్రులు, రెఫరల్ కేంద్రాలు, ప్రమాద ప్రాంతాలు, అంబులెన్స్ స్టేషన్ల మ్యాపింగ్ చేపట్టి సమీపంలోని తగిన ఆసుపత్రికి రోగులను వేగంగా తరలించే విధంగా సేవలను బలోపేతం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా అత్యవసర వైద్య సేవలు సమానంగా అందేలా శాస్త్రీయ ప్రణాళికతో అంబులెన్స్‌లను మోహరించాలని సూచించారు.


