
వివాహేతర సంబంధాల మోజుతో భర్తలను, భార్యలను కడతేరుస్తున్న ఘటనలు ఈ మధ్య చూస్తున్నవే. అలాగే.. ప్రేమ మత్తులో తల్లిదండ్రులకు, అయిన వాళ్లకూ ద్రోహాన్ని తలపెడుతున్న జంటలనూ చూస్తున్నాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్వాతి తన ప్రేమికుడి కోసం చేసిన పని మాత్రం.. నెక్ట్స్ లెవల్ అంతే!.
స్వాతి(21).. స్థానికంగా సెలూన్ నడిపించే మనోజ్(22) అనే యువకుడ్ని గాఢంగా ప్రేమించింది. కానీ, ఇంట్లో వాళ్లు తమ ప్రేమకు ఒప్పుకోరని భయపడింది. ఈ క్రమంలో రోజూ రాత్రి ఇంట్లో వాళ్లు తినే తిండిలో మత్తు మందు మాత్రలు కలుపుతూ వచ్చింది. వాళ్లు నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో ఊరిలో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఏకాంతంగా గడపం చేస్తూ వచ్చింది. అలా.. ఓ రోజు స్వాతి కదలికలపై ఇంట్లో వాళ్లకు అనుమానం కలిగింది. దీంతో..
ఆమె మనోజ్‌ను సలహా అడిగింది. గప్‌చుప్‌గా ఇంట్లో వాళ్లను చంపేయమని చెప్పాడు మనోజ్. స్వాతి అన్నంత పని చేయబోయింది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైంది. దీంతో.. ఆ ప్రేమ జంట ఓ క్రైమ్ షో స్పూర్తితో మరో భయంకరమైన స్కెచ్ వేసింది.
తమ ప్లాన్‌ను మనోజ్ తన దగ్గరి బంధువు మాంజిత్‌కు సాయం కోరాడు. మాంజిత్ అందుకు సంతోషంగా అంగీకరించాడు. సెప్టెంబర్ 17వ తేదీన.. స్థానికంగా పెయింటింగ్ పనులు చేసే యోగేష్.. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాడు. అతన్ని గమనించి మనోజ్.. మద్యం ఆఫర్ చేసి అతన్ని జనసంచారం లేని ప్రాంతంలోకి తీసుకెళ్లారు.
అయితే అప్పటికే మద్యంలో నిద్రమాత్రలు కలవడంతో యోగేష్ సోయి లేకుండా పడిపోయాడు. ఆపై అతన్ని మనోజ్, మాంజిత్‌లు తమ బైక్‌పై ఎక్కించుకుని దగ్గర్లోని ఓ స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుక రాళ్లతో కొట్టి యోగేష్‌ను దారుణంగా హతమార్చారు. ఆపై యోగేష్ ఫోన్ నుంచి స్వాతి సోదరుడు గౌరవ్‌కు ఫోన్ చేసి.. కాల్ కట్ చేశారు. అటుపై పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ‘‘యోగేష్, కపిల్(స్వాతి సోదరులు), శోభారామ్(స్వాతి తండ్రి) తనపై దాడి చేస్తున్నారని.. తనను కాపాడాలని’’ వేడుకుంటూ ఫోన్ కట్ చేసి యోగేష్ డెడ్‌బాడీ దగ్గర పడేసి వెళ్లిపోయారు.
తెల్లారి స్మశానంలో శవాన్ని గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక ఆధారాలతో.. ఈ కేసులో పోలీసులు స్వాతి తండ్రి, సోదరులే నిందితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో.. యోగేష్‌కు, వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. పైగా తండ్రి, సోదరులు అరెస్ట్ అయినా స్వాతి ఏమాత్రం ఆందోళన లేకుండా ఉండిపోవడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. దీంతో..
ఆమె కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆమె మనోజ్‌ను రహస్యంగా కలవడంతో.. అనుమానం అతనిపైకి మళ్లింది. సీసీఫుటేజీ, ఇతర ఆధారాలతో స్వాతి కుటుంబ సభ్యులకు ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు ఓ అంచనాకి వచ్చారు. అదే సమయంలో.. యోగేష్ హత్యలో మనోజ్ పాత్రను నిర్ధారించుకున్న పోలీసులు అప్పటికే పరారైన అతని కోసం గాలింపు ఉధృతం చేశారు.
ఈ క్రమంలో ఆదివారం(సెప్టెంబర్ 22వ తేదీ) అతనిపై కాల్పులు జరిపి(కాలికి బుల్లెట్ గాయం అయ్యింది) మరీ అదుపులోకి తీసుకున్నారు. అలా పోలీసుల ఎదుట మనోజ్, మాంజిత్‌లు నేరం ఒప్పుకున్నారు. అయితే.. ఈ కేసులో మాస్టర్ మైండ్ స్వాతినే అని చెప్పేసరికి పోలీసులు కంగుతిన్నారు.
తన తండ్రిని, సోదరులను ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తే కటకటాల పాలవుతారని, అలా తమకు ఏ అడ్డు ఉండబోదని స్వాతి భావించిందట. అలా పాపం అమాయకుడైన యోగేష్‌ను కూడా చంపేందుకు ఆమెనే ఎంపిక చేసిందట. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. కోర్టులో నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు. ఈ ఘాతుకం ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో జరిగింది.