
ఢిల్లీ: పాకిస్తాన్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘిస్తే ప్రపంచపటంలో తన ఉనికిని కోల్పోతుందన్నారు. భారత్‌తో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఇకపై తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు. భారత్ ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు.. కావాలని ఎవరైనా జోలికి వస్తే వారిని వదిలిపెట్టబోమని ‘ఆపరేషన్ సిందూర్’తో నిరూపించామని చెప్పుకొచ్చారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఛత్తీస్‌గఢ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ..‘పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా ‘ఆపరేషన్ సిందూర్’తో భారత సైన్యం పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. సైనిక బలగాల ధీరత్వానికి, మోదీ నాయకత్వానికి నేడు ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాలి. మన ఆడబిడ్డల సిందూరం తుడిచినవాని నట్టింటికి వెళ్లి నాశనం చేయడం దేశ శౌర్యానికి ప్రతీక. భారత్ ఎవరితోనూ గొడవలు పెట్టుకోదు.. కావాలని ఎవరైనా మనపైకి వస్తే వారిని వదిలిపెట్టబోమని ‘ఆపరేషన్ సిందూర్’తో నిరూపించాం. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం భారత సైనిక బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఈ కారణంగానే దాయాది దేశం పన్నుతున్న కుట్రలను మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతోంది’ అని వివరించారు.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అంశంపైనా కేంద్రమంత్రి స్పందించారు. దేశంలో తరచూ ఎన్నికలు నిర్వహించడంతో ప్రభుత్వాలపై ఖర్చుల భారం అధికంగా పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ప్రజలు సైతం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’కు మద్దుతు తెలపాలని కోరారు. ప్రధాని మోదీ దార్శనికతతో తీసుకొచ్చిన ఈ బృహత్తర కార్యక్రమం గొప్పదని అన్నారు.