
ఆ తరవాతి స్థానాల్లో ప్రేమ, ఆందోళన
రోజులో సానుకూల భావోద్వేగాలే ఎక్కువ
స్త్రీల కంటే పురుషుల్లోనే అధిక పాజిటివ్ ఎమోషన్లు
90 శాతం సమయంలో ఏదో ఒక భావోద్వేగం
సంతోషం, బాధ, ఆందోళన, ఆశ్చర్యం, కోపం.. ఇలాంటి భావోద్వేగాల సమాహారమే మన జీవితం. ఆ క్షణానికే చిన్న పిల్లల్లా మారిపోతాం.. మరుక్షణమే రాక్షసుల్లా ప్రవర్తిస్తాం.. ఇంకో క్షణంలో తీవ్ర ఒత్తిడికి గురవుతాం.. ఏ ఎమోషన్ కూడా మనలో ఎక్కువ సేపు ఉండదు. చాలామంది దీన్ని అంగీకరించరు కానీ ఇదే వాస్తవం. సరే, ఇన్ని భావోద్వేగాల్లో మనతో ఎక్కువ సేపు ఉండేది ఏది? చాలామంది అనుకుంటున్నట్టు బాధ / ఆవేదన / ఆందోళన ఇవేనా మన రోజువారీ జీవితంలో రాజ్యమేలుతున్నాయి? అంటే కాదు.. అంటున్నారు మానసిక నిపుణులు.
సాక్షి, స్పెషల్ డెస్క్: ఏ మనిషీ రోజూ ఏడుస్తూ కూర్చోడు.. ఆవేదన, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరైపోడు. అలాగని రోజంతా సంతోషం, ఆనందం కూడా ఉండవు. కానీ, ఒక రోజులో ఒక మనిషిలో ఎక్కువ సేపు ఉండే ఎమోషన్ ఏదో తెలుసా.. సంతోషం. నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికాకు చెందిన వేర్వేరు విభాగాలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. చాలామంది కోపిష్టులు మన చుట్టూ ఉంటారు. వాళ్లు కూడా రోజంతా ఎవరు దొరుకుతారా తిడదామా, కొడదామా అని రోజంతా ఉండరు. రోజు మొత్తం భావోద్వేగాల్లో ఇది 10 శాతం కూడా ఉండదు. కానీ, స్త్రీలలో మాత్రం పురుషుల కంటే ఎక్కువ సమయం కోపం ఉంటోందట. భయం కూడా రోజులో చాలా తక్కువ సేపే.. కేవలం 5 శాతమే ఉంటోంది.
రోజుకు ఒకలా..
ఇకపోతే అన్ని రోజులూ అన్ని ఎమోషన్లూ ఒకేలా ఉండవు. సాధారణంగా వారం ప్రారంభంలో విచారం, ఆందోళన, కోపం వంటి ప్రతి కూల భావోద్వేగాల శాతం ఎక్కువగా ఉంటోంది. వారాంతంలో అనుకూల భావోద్వేగాలైన ఆనందం, ప్రేమ, సంతృప్తి ఎక్కువ శాతంలో ఉంటున్నాయి.
పురుషుల్లో ఒకలా.. మహిళల్లో మరోలా..
⇒ రోజువారీ జీవితంలో 45 శాతం సమయంలో పూర్తిగా పాజిటివ్ ఎమోషన్స్ ఉంటున్నాయని మగాళ్లు చెప్పారు. అలాగే 14 శాతం నెగెటివ్, 31 శాతం మిశ్రమ భావోద్వేగాలు ఉంటున్నాయని చెప్పారు.
⇒ ఈ విషయంలో మహిళలు.. 39 శాతం పాజిటివ్, 17 శాతం నెగెటివ్, 34 శాతం మిశ్రమ భావోద్వేగాలు ఉంటున్నాయని చెప్పారట.
⇒ స్త్రీలతో పోలిస్తే పురుషులు సానుకూల భావోద్వేగాలను ఎక్కువ సార్లు అనుభవిస్తున్నారట. ఇందులో కూడా ప్రత్యేకించి.. ఆనందం, సంతృప్తి, అప్రమత్తత, ఉల్లాసం, గర్వం వంటివి స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువసార్లు కలుగుతున్నాయట.

ప్రామాణిక పరిశోధన
నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికాకు చెందిన వేర్వేరు విభాగాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. మొత్తంగా 11,572 మంది పాల్గొన్నారు. సగటు వయసు 33 సంవత్సరాలు. ఇందులో ఫ్రెంచి, స్విస్, బెల్జియం దేశాల వారు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో సగానికిపైగా మహిళలే. ఈ అధ్యయనం కోసం ‘58 సెకెన్లు’ అనే మొబైల్ యాప్‌ని తయారుచేశారు.
రోజులో ఏ సమయంలో ఏ భావోద్వేగం ఉంటుందో చెప్పాలని వీరికి ఒక ప్రశ్నపత్రం ఇచ్చారు. 2013 ఫిబ్రవరి నుంచి 2014 ఏప్రిల్ వరకు డేటా సేకరణ చేశారు. ఈ యాప్ ఇప్పటికీ కూడా పనిచేస్తోంది. ఇది ప్రపంచ ప్రసిద్ధ ప్లస్ వన్ సైన్స్ జర్నల్ సహా అనేక జర్నళ్లలో ప్రచురితమైంది. దీన్ని ఇప్పటికీ భావోద్వేగాలకు సంబంధించి ప్రామాణిక పరిశోధనల్లో ఒకటిగా పరిగణిస్తారు.
ఒక రోజులో ఏ ఎమోషన్ మనలో ఎక్కువ శాతం ఉంటుందంటే.. టాప్ 10 ఎమోషన్లు
⇒ ఆనందం
⇒ ప్రేమ
⇒ ఆందోళన
⇒ సంతృప్తి
⇒ అప్రమత్తత
⇒ ఆశ
⇒ విచారం
⇒ ఉల్లాసం
⇒ గర్వం
⇒ అసహ్యం / చిరాకు
⇒ రోజులో రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో ఆనందం, ఉల్లాసం, ప్రేమ వంటి భావోద్వేగాలు ఎక్కువగా కనిపించాయి.
⇒ రోజులో ఎక్కువ సార్లు కలిగే అనుభూతి ఆనందం. ఆ తరవాతి స్థానాల్లో ప్రేమ, ఆందోళన ఉన్నాయి. ప్రతికూల భావోద్వేగాల కంటే అనుకూలమైనవి 2.5 రెట్లు ఎక్కువ సార్లు రోజులో కలుగుతున్నాయట. రోజులో 90 శాతం సమయంలో ప్రతి కూల లేదా అనుకూల లేదా మిశ్రమ.. ఇలా ఏదో ఒక భావోద్వేగం కలుగుతోందట.