సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌కు ఊరట లభించింది. వీరు ముగ్గురు ఎన్నికల అఫిడవిట్లలో తమ ఆస్తి వివరాలను దాచారని, దీనిపై ఆదాయపన్ను శాఖ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
వివరాల మేరకు.. పెరంబూర్ నియోజకవర్గ ఓటరు విఘ్నేష్ దాఖలు దాఖలు చేసిన పిటిషన్‌లో సీఎం విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో వేర్వేరు ఆస్తి వివరాలను చూపించారని ఆరోపించారు. పెరంబూర్‌లో రూ. 115 కోట్లుగా చూపిన ఆస్తులను, తిరుచ్చి ఈస్ట్‌లో రూ. 220 కోట్లుగా పేర్కొన్నారు. ఈ తప్పుడు సమాచారాలపై ఐటీ శాఖ, ఎన్నికల సంఘం విచారణ జరపాలని కోరారు. అలాగే, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి చేపాక్కం –ట్రిప్లికేన్ నియోజకవర్గ అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారని పేర్కొంటూ ఓటరు కుమారవేల్ పిటిషన్ వేశారు. మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ గత లోక్‌సభ ఎన్నికల కంటే ఇప్పుడు భిన్నమైన వివరాలు సమర్పించారని గౌతమ్ శివ అనే ఓటరు పిటిషన్ వేశారు.
ఎన్నికల సంఘం వివరణ..
ఈ మూడు వేర్వేరు పిటిషన్లు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్‌మురుగన్ ధర్మాసనం ఎదుట బుధవారం విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ వాదనలు వినిపించారు. సీఎం విజయ్ రెండు నియోజకవర్గాల్లోనూ పేర్కొన్న ఆస్తి విలువలు సరిగ్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో కేవలం ఎన్నికల పిటిషన్ మాత్రమే వేయడానికి చట్టంలో వీలుంటుందన్నారు. ఇప్పటికే ఇలాంటి పలు పిటిషన్లను కోర్టులు కొట్టివేసాయని వివరించారు. ఎన్నికల సంఘం వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు.. సీఎం విజయ్, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్, బీజేపీ అభ్యర్థి, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పిటిషన్లను పూర్తిగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


