ప్రేమలో పడటానికి, ఆత్మీయ నేస్తాన్ని మనసారా జీవితంలోకి ఆహ్వానించడానికి వయసుతో పనేముంది. కొందరు తమ ఇరవైలలోనే తమ సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. మరికొందరు నిజమైన తోడు కోసం దశాబ్దాల తరబడి వేచి ఉంటారు. కానీ అరవై ఏళ్ల వయసులో అంటే ఎవ్వరూ ఊహించరు కదా. ప్రఖ్యాత నటి సుహాసిని ములేది 60లలో కూడా ప్రేమ దొరుకుతుందని నిరూపించారు. సుహానా సఫర్‌తో ఇటీవల జరిగిన సంభాషణలో, జాతీయ అవార్డు గ్రహీత సుహాసినీ 60 ఏళ్ల వయసులో తన పెళ్లి గురించి గుర్తుచేసుకున్నారు.
“నేను 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అప్పటివరకు నాకు సరైన జోడి దొరకలేదు. నా భర్త చాలా పేరున్న శాస్త్రవేత్త. ఆయన సైన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమీ అర్థం కాదు, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి,” అని తన భర్త గురించి ములే చెప్పుకొచ్చారు. లగాన్, జోధా అక్బర్ వంటి చిత్రాలలో అద్భుత నటనతో ఆకట్టుకుని, అనేక సినిమాల్లో రాణించిన సుహాసిని, ఇక తానెప్పటికీ పెళ్లి చేసుకోలేనేమో ఒంటరిగానే ఉండిపోతానేమే అనుకునేవారట. కానీ విధి మరోలా ఉంది.

పేట్ మార్చిన ఫేస్‌బుక్ మెసేజ్
ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా, ఫేస్‌బుక్‌లో అనుకోకుండా లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్ట్ (LHC) భౌతిక శాస్త్రవేత్త (Physicist) అతుల్ గుర్తు ప్రొఫైల్ రికమండేషన్ కనిపించింది. అరే..భౌతిక శాస్త్రవేత్తలుకూడా ఫేస్‌బుక్‌లో ఉన్నారా?’ అనుకున్నారు. తనకు ఎప్పటినుంచో సైన్స్ అంటే ఆసక్తి ఉండటంతో, ఇంకొంచెంఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ‘LHC అంటే ఏంటి?’ అని ఒక మెసేజ్ పంపారు. అంతే అదే ఆమె జీవితాన్ని అందమైన మలుపు తిప్పింది.
ఒక్క మెసేజ్
వయసు వ్యత్యాసాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వారిద్దరూ అనేకసార్లు మాట్లాడుకున్నారు. అయితే ఒకరోజు అతుల్ ఆమెకు, "బంధాలను మనమే నిర్మించుకోవాలి; అవి ఆకాశం నుండి ఊడిపడవు" అన్నపుడు పట్ల పూర్తి నమ్మకాన్ని పెంచుకుంది. అయితే, ఆమె నమ్మకాన్ని మరింత బలపరిచిన విషయం ఏమిటంటే, ఆయన తన మొదటి భార్య గురించి రాసిన ఒక వ్యాసం. క్యాన్సర్ బారిన పడ్డ తన భార్య చనిపోయేలోపు ఆమె కోరుకున్న కోరికలన్నీ తీర్చారు. అంతేకాకుండా, ఆమెను సంతోషపెట్టేందుకే ఆమె అనారోగ్య సమస్యను ఆయన ఎంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. ఈ విషయం సుహాసిని దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆమె హృదయాన్ని కూడా తాకింది.
అలా కొన్ని రోజులు ఆన్‌లైన్లో మాట్లాడుకున్నారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ చివరిలో ముఖాముఖి కలుసుకున్నారు. అలాగే గుర్తును కలిసి, మాట్లాడిన తర్వాత, తన కూతురు సరైన ఎంపిక చేసుకుందని ఆమె తల్లికి నమ్మకం కలిగిందట. అలా సుమారు 75 రోజుల తర్వాత, కుటుంబం అంగీకారంతో 2011 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఎంత అసాధారణంగా ఉందంటే, పెళ్లి రిజిస్ట్రార్ కూడా ఆశ్చర్యపోయారట. అయితే తన యవ్వనంలో పెళ్లి చేసుకోనందుకు ఎదుర్కొన్న విమర్శల మాదిరిగానే, 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందట.
జీవితంలో ఆలస్యంగా ప్రేమను కనుగొనడం తాను పొందిన అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందంటారు సుహాసిని. సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోయో, వయసు పెరుగుతోందనో ఏవరో చెప్పారనో జీవితంలో అతి ముఖ్యమైన సంబంధంలోకి జారిపోకుండా, నిజాయితీగా ఇరు మనసులు కలిసిన నిష్కల్మషమైన ప్రేమే మిన్న అని చాటి చెప్పారు.
ఎవరీ సుహాసినీ ములే
సుహాసిని ములే హిందీ, మరాఠీ, అస్సామీ చిత్రాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. నటనతో పాటు, ఆమె డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో, ఆమె మొత్తం ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. సుహాసిని ములే 1950 నవంబర్ 20న బిహార్‌లోని పాట్నాలో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించారు. 1965లో, పియర్స్ సబ్బు ప్రకటన కోసం సుహాసిని ములే మోడల్‌గా ఎంపికయ్యారు. ఈ ప్రకటనను చూసిన తర్వాత, ప్రముఖ చిత్ర దర్శకుడు మృణాల్ సేన్ తన చిత్రం భువన్ షోమ్ (1969)లో ఆమెకు ఒక పాత్రను అందించారు.అలా మొదలైన ఆమె నటనా ప్రస్తానం ఎన్నో విజయవంతమైన పాత్రలు, అవార్డులు, రివార్డులతో అద్వితీయంగా సాగింది.


