పరస్పర అంగీకారంతో కూడిన సుదీర్ఘ సంబంధాలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలకమైన తీర్పు నిచ్చింది. కేవలం పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నెరవేర్చలేదనే కారణంతో ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న దీర్ఘకాలిక శారీరక సంబంధాన్ని అత్యాచారం (Rape)గా పరిగణించ లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది సంజయ్ సరోజ్ అలియాస్ సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.
కేసు నేపథ్యం
పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం 2014లో ప్రయాగ్‌రాజ్ వచ్చింది బాధిత యువతి. ఈ క్రమంలో దూరపు బంధువు, నిందిత యువకుడు చదువు, వసతి విషయంలో ఆమెకు సహాయం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ దగ్గరయ్యారు. 2019 దాకా దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అతను ముఖం చాటేశాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఇపుడు పెళ్లి మాట ఎత్తితే కొట్టి, బెదిరంపులకు పాల్పడుతున్నాడంటూ 2019లో ప్రయాగ్‌రాజ్‌లోని కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. తన అశ్లీల వీడియో తీసి బ్లాక్‌మెయిల్ కూడా చేస్తున్నాడని కూడా పేర్కొంది. 2020లో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, 2021లో మేజిస్ట్రేట్ దీనిని పరిగణనలోకి తీసుకున్నారు.
దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించి, తనపై ఉన్న క్రిమినల్ విచారణను కొట్టివేయాలని కోరాడు. కేసును, ఇరుపక్షాల వాదనలను విశ్లేషించిన అనంతరం, వారి సంబంధం చాలా సంవత్సరాలు, పరస్పర అంగీకారంతోనే సాగిందని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ నిర్ధారించింది.
ఐదేళ్ల సుదీర్ఘ సంబంధాల తర్వాత , ప్రతిసారీ కేవలం పెళ్లి వాగ్దానం వల్లే ఆమె శారీరక సంబంధానికి అంగీకరించిందంటే విశ్వసించలేమని కోర్టు పేర్కొంది. వైద్య పరీక్షల్లో ఆమెపై ఎలాంటి గాయాలు ఉన్నట్లు తేలలేదనీ, ఇరువురి సమ్మతితోనే ఈ బంధం కొనసాగిందని కోర్టు అభిప్రాయపడింది. దీర్ఘకాలిక సంబంధాల్లో తేడాలొచ్చినపుడు, లేదా విఫలమై నప్పుడు దానిని అత్యాచారంగా పరిగణించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు హెచ్చరించింది.
ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరం
ఫిర్యాదుదారు తన పూర్తి అంగీకారంతో నిందితుడితో శారీరక సంబంధాలు ఏర్పరచు కున్నప్పుడు ఇది కేవలం పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం దెబ్బతినడం మాత్రమే కానీ, అత్యాచారం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా, నిందితుడిపై క్రిమినల్ విచారణను కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంటూ, అతనిపై ఉన్న అన్ని చట్టపరమైన విచారణలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అంతేకాదు ట్రయల్ కోర్టులోని కేసు ప్రొసీడింగ్స్ మొత్తాన్ని హైకోర్టు రద్దు చేసింది.
ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!


