‘టీఎంసీ’పై స్పీకర్ తుది నిర్ణయం
తమ వర్గానికి గుర్తింపు కోరుతున్న టీఎంసీ రెబల్స్
అభిషేక్ బెనర్జీకి ఆహ్వానం పంపిన ఓం బిర్లా
ధ్రువీకరించిన మమత వర్గం ఎంపీ కీర్తి ఆజాద్
న్యూఢిల్లీ: టీఎంసీ తిరుగుబాటు వర్గానికి గుర్తింపు విషయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మమతా బెనర్జీ సారథ్యంలోని ఎంపీల వాదనలు కూడా వినే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇరుపక్షాల వాదనలతోపాటు, న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకున్నాకే ఆయన అంతిమ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం టీఎంసీ మమత వర్గం నేత అభిషేక్ బెనర్జీకి కబురు పంపారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ధ్రువీకరించారు.
సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయానికి రావాలంటూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్పీకర్ ఓం బిర్లా మెయిల్ పంపించారని ఆజాద్ వివరించారు. అయితే, అభిషేక్ ఆ సమయంలో ఈడీ కార్యాలయంలో ఉన్నారని, అధికారుల విచారణ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి కావచ్చని ఆజాద్ అన్నారు. దీంతో, స్పీకర్‌ను అభిషేక్ కలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. రెండు రోజుల క్రితం టీఎంసీ తిరుగుబాటు ఎంపీలంతా నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ)లో చేరుతున్నట్లు ప్రకటించడం తెల్సిందే. అయితే, వీరంతా తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. టీఎంసీ రెబల్స్ వినతిపై స్పీకర్ సానుకూలంగా స్పందించిన పక్షంలో లోక్‌సభలో రెండో అతిపెద్ద ఎన్డీయే పక్షంగా ఈ వర్గం అవతరించనుంది. లోక్‌సభలో స్పీకర్ మినహాయిస్తే బీజేపీ బలం 239 కాగా, టీడీపీకి 16, జేడీయూకి 12 మంది సభ్యుల బలముంది.
మా బలం 22కు చేరుకోవచ్చు
తమ వర్గం ఎంపీలందరినీ చేర్చుకునేందుకు ఎన్‌సీపీఐ అంగీకరించిందని టీఎంసీ తిరుగుబాటు వర్గం నేతల్లో ఒకరైన కాకోలీ ఘోష్ దస్తీదార్ తెలిపారు. తమ వర్గంలోని ఎంపీల సంఖ్య ప్రస్తుతమున్న 20 నుంచి 22 వరకు పెరగొచ్చని ఆమె వెల్లడించారు. లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలున్నారు. ‘మేమంతా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సారథ్యంలోని ఎన్డీయేతో కలిసి పనిచేస్తాం’అని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ వద్ద మీడియాకు తెలిపారు. అదేవిధంగా, బెంగాల్‌లో టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.
‘వారంతా వేరు గ్రూపు, వాళ్ల అజెండా, అంశాలు వేరే. మాకు సంబంధం లేదు’అని కాకోలీ ఘోష్ చెప్పారు. ఎన్‌సీపీఐతో విలీనం మొదటి దశ పూర్తయిందని టీఎంసీ తిరుగుబాటు వర్గంలోని సుదీప్ బందోపాధ్యాయ్ తెలిపారు. జూలైలో పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. టీఎంసీ గుర్తులు, ఆస్తులు, ఇతర సంస్థాగత అంశాలపై వివాదాలను కోర్టులోనే తేల్చుకుంటామని సుదీప్ తెలిపారు. కాగా, పారీ్టలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ఎన్‌సీపీఐ తమకు నివేదించాల్సిన అవసరముందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఎన్‌సీపీఐ సారథిగా జ్యోతిప్రకాశ్ చటర్జీ
లోక్‌సభలో టీఎంసీ తిరుగుబాటు వర్గం చేరికతో ఒక్కసారిగా దేశ రాజకీయక యవనికపై తళుక్కుమన్న నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎన్‌సీపీఐ)కు నూతన సారథిగా జ్యోతిప్రకాశ్ చటర్జీ నియమితులయ్యారు. ఇటీవల కాకోలీ ఘోష్ దస్తీదార్ సారథ్యంలోని టీఎంసీ ఎంపీలు ఎన్‌సీపీఐలో చేరారు. అనంతర పరిణామాల్లో ఆ పార్టీ వ్యవస్థాపకురాలైన షెవ్లీ కుందు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో, కాకోలీ ఘోష్ దస్తీదార్ ఆ బాధ్యతలను చేపడతారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాకోలీ ఘోష్ దస్తీదార్ మంగళవారం ఒక ప్రకటన చేశారు.
ఎన్‌సీపీఐ నూతన సారథిగా జ్యోతి ప్రకాశ్ నియమితులైనట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఎన్‌సీపీఐ మాదిరిగానే ఈ జ్యోతిప్రకాశ్ పేరు కూడా ఎవరికీ అంతగా తెలియకపోవడం విశేషం. ఎన్‌సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా చెప్పుకుంటున్న శంతను దేవ్ ఈ పరిణామంపై స్పందించారు. జ్యోతిప్రకాశ్ చటర్జీ ఎవరూ తనకు తెలియదంటూ బాంబు పేల్చారు. ఎన్‌సీపీఐ కోసం ఎంతో కష్టపడ్డాం, ఇప్పుడు తమ పారీ్టలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పెద్ద నేతలెందరో మా పారీ్టలో చేరడం సంతోషంగా ఉంది. అయితే, వీరెవరూ తమను సంప్రదించలేదన్నారు.
అఖిలపక్ష భేటీకి టీఎంసీ రెబల్ నేతకు ఆహ్వానం
కోల్‌కతా: బెంగాల్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 18వ తేదీ నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలకు గాను ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఈ ఏర్పాటు చేసింది. మమతా బెనర్జీ అనుకూల వర్గం ఎమ్మెల్యేలకు బదులుగా ప్రభుత్వం ఆహ్వానం పంపించలేదు. తిరుగుబాటు వర్గం ఎన్నుకున్న రితబ్రత బెనర్జీకి మాత్రమే ఆహ్వానం పంపించింది. మమత సారథ్యంలోని టీఎంసీ ప్రతిపక్ష నేతగా ప్రకటించిన శోభన్‌దేవ్ చటోపాధ్యాయ్‌ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీ నుంచి ఎన్నికైన 80 మందికిగాను 65 మంది ఎమ్మెల్యేలు రితబ్రతకు మద్దతు ప్రకటించడం తెల్సిందే. దీంతో, టీఎంసీ తిరుగుబాటు వర్గమే ప్రముఖంగా అవతరించింది. టీఎంసీలో సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా, అఖిలపక్ష సమావేశానికి ఐఎస్‌ఎఫ్ ఎమ్మెల్యే నౌషాద్ సిద్దిఖి, ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్, సీపీఎం ఎమ్మెల్యే ముస్తాఫిజుర్ రహమాన్ హాజరయ్యారు.


