Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో! | Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!

Published Sat, May 4 2024 4:08 AM

Lok sabha elections 2024: BJP targets third consecutive sweep, AAP hopes to capitalise on sympathy wave for Kejriwal

దేశానికి ఆయువుపట్టయిన ఢిల్లీని కొల్లగొట్టిన వారే ఎర్రకోటలో జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ, ఆపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఢిల్లీని క్లీన్‌స్వీప్‌ చేసి కేంద్రంలో అధికారం చేపట్టాయి. గత రెండు ఎన్నికల్లో రాజధానిలోని మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తోంది. 

ఎంపీలపై వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను పక్కన పెట్టేసింది! ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొన్న ఆప్‌.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు తాలూకు సానుభూతిని అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తోంది. 
కేజ్రీవాల్‌ భార్య సునీత పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు.                        

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా భిన్నమైన తీర్పు ఇవ్వడం ఢిల్లీ ఓటర్లకు కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దశాబ్దాలుగా ఢిల్లీ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌పై 90వ దశకం నుంచి క్రమంగా బీజేపీ ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత నుండి హస్తినలో అధికారం ఆ రెండు పారీ్టల మధ్యే మారుతూ వచి్చంది. 

2009లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేయగా 2014, 2019ల్లో అదే ఫీట్‌ను బీజేపీ చేసి చూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ‘చీపురు’ తిరగేసిన ఆప్‌ లోక్‌సభకు వచ్చేసరికి ఒక్క స్థానమూ దక్కించుకోలేకపోయింది. ఓట్లపరంగా కూడా బీజేపీ ఆ రెండు పారీ్టలకు అందనంత ఎత్తులో నిలిచింది. కమలం గుర్తుకు 56.86 శాతం ఓట్లు రాగా హస్తానికి 22.51 శాతం, ఆప్‌కు గుర్తుకు 14.79 శాతం పోలయ్యాయి. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఆప్‌ చేతిలో వరుసగా భంగపాటు తప్పడం లేదు.

కేజ్రీవాల్‌ అరెస్టు కలిసొచ్చేనా? 
నయా రాజకీయాలతో సంచలనం అరవింద్‌ కేజ్రీవాల్‌ 2012లో పెట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నానాటికీ బలపడుతూ వచి్చంది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌.. 70 సీట్లకు 28 స్థానాలు సాధించింది. బీజేపీకి 32 సీట్లు రావడంతో హంగ్‌ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాకపోవడంతో 8 సీట్లొచి్చన కాంగ్రెస్‌ మద్దతుతో కేజ్రీవాల్‌ తొలిసారి సీఎం అయ్యారు. కానీ 49 రోజులకే రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఒక్క సీటూ రాలేదు. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లతో సంచలనం సృష్టించింది. 

కేజ్రీవాల్‌ రెండోసారి సీఎం అయ్యారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేతులెత్తేసినా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 62 సీట్లతో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి తరఫున సుడిగాలి ప్రచారానికి సన్నద్ధమైన కేజ్రీవాల్‌ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలు పాలయ్యారు. ఇది ఆప్‌కు కలిసొస్తుందా, ప్రతికూలంగా మారుతుందా అన్నది ఆసక్తికరం. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొనడం ఆప్‌కు ఊరటనిచ్చే పరిణామమే. దీనిపై మే 7న కోర్టు వెలువరించబోయే నిర్ణయం కోసం పార్టీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.  

బీజేపీ ‘హ్యాట్రిక్‌’ గురి... 
ఢిల్లీలో హ్యాట్రిక్‌ క్లీన్‌స్వీప్‌ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్‌ తివారీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భోజ్‌పురి సూపర్‌ స్టార్‌ 2014లో ఇక్కడి నుంచే బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. తర్వాత ఢిల్లీ బీజేపీ పగ్గాలు చేపట్టి 7 సీట్లనూ క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి తివారీ తప్ప మిగతా ఆరుగురు సిట్టింగులనూ బీజేపీ మార్చేయడం విశేషం! ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని బీజేపీ ప్రధాన ప్రచారాంశంగా జనంలోకి తీసుకెళ్తోంది. మోదీ ఫ్యాక్టర్‌తో పాటు సీఏఏ, అయోధ్య రామ మందిరం, ఆర్టికల్‌ 370 రద్దు తదితరాలను నమ్ముకుంది. 

పూర్వాంచలీలు, ముస్లింల ఆధిపత్యముండే ఈశాన్య ఢిల్లీ స్థానంలో బిహార్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య కీలక పోరు జరగనుంది. హ్యాట్రిక్‌తో మూడోసారి లోక్‌సభలో అడుగుపెట్టాలనుకుంటున్న మనోజ్‌ తివారీ ఒకవైపు, కాంగ్రెస్‌ నుంచి కన్హయ్య కుమార్‌ మరోవైపు బరిలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక సమతూకం పాటించింది. తూర్పు ఢిల్లీ నుంచి పంజాబీ అయిన హరీశ్‌ మల్హోత్రా, చాందినీ చౌక్‌ నుంచి బనియా నాయకుడు ప్రవీణ్‌ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి గుజ్జర్‌ నాయకుడు రాంవీర్‌ సింగ్‌ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి జాట్‌ నాయకుడు కమల్జీత్‌ సెహ్రావత్, ఎస్సీ రిజర్వ్‌డ్‌ వాయవ్య ఢిల్లీ నుంచి దళిత నాయకుడు యోగేంద్ర చందోలియాలను బరిలో నిలిపింది. కమల్‌జీత్‌తో పాటు న్యూఢిల్లీ నుంచి దివంగత సుష్మా స్వరాజ్‌ కుమార్తె బాసురీ స్వరాజ్‌ రూపంలో ఇద్దరు మహిళలకూ అవకాశం ఇచి్చంది.

సునీతా కేజ్రీవాల్‌ ప్రచారం... 
ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వాములుగా ఆప్‌ 4 స్థానాల్లో, కాంగ్రెస్‌ 3 చోట్ల బరిలో దిగుతున్నాయి. రాజధానిలో బీజేపీకి ఎలాగైనా ముకుతాడు వేయాలని చూస్తున్నాయి. ‘ఢిల్లీ మోడల్‌’ను కేజ్రీవాల్‌ ప్రధానంగా ప్రచారం చేశారు. ఆయన జైలుపాలైన నేపథ్యంలో ఆప్‌ ప్రచార భారాన్ని భార్య సునీతా కేజ్రీవాల్‌ భుజానికెత్తుకున్నారు. ఆమె సభలకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు వంటి అంశాలను ఆప్, కాంగ్రెస్‌ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పైనా విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో, విపక్షాలపై దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఉసిగొల్పుతోందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.

సర్వేలేమంటున్నాయి... 
ఢిల్లీలో ఈసారి కూడా బీజేపీ మొత్తం 7 లోక్‌సభ సీట్లనూ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని పలు సర్వేలు అంటున్నాయి. అయితే కేజ్రీవాల్‌ అరెస్టు తాలూకు సానుభూతిఆప్‌కు కలిసొస్తే ఆ పారీ్టకి ఒకట్రెండు స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. 

– సాక్షి, న్యూఢిల్లీ

Advertisement
Advertisement