
సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మద్యం ధరలు(Liquor Prices) పెరిగాయి. దుకాణాల లైసెన్స్ ఫీజు పెరగడంతోనే ఈ నిర్ణయాన్ని వర్తకులు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మద్యం ధరలు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తక్కువే. తమిళనాడు నుంచి పుదుచ్చేరికి(Puducherry) వెళ్లి పార్టీలు చేసుకునే వాళ్లు ఎక్కువ. అలాగే ఇక్కడి నుంచి తమకు కావాల్సిన బాటిళ్లను కొన్ని నిబంధనలకు అనుగుణంగా తెచ్చుకునే వారు కొందరైతే, అక్రమ రవాణా చేసే వారెందరో. 2015లో మద్యం లైసెన్స్ ఫీజును పెంచారు.
ఆ తర్వాత పది సంవత్సరాలుగా ఎలాంటి పెంపు అన్నది జరగలేదు. తాజాగా లైసెన్స్ ఫీజు పెంపునకు(License fee) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి 558 మద్యం దుకాణాల ఫీజులు పెరిగాయి. గత ఏడాది పుదుచ్చేరికి మద్యం రూపంలో 1500 కోట్లు ఆదాయం రాగా, తాజాగా పెంపుతో రూ. 1,850 కోట్లకు చేరింది. ఈపెంపు నేపథ్యంలో ధరలను సైతం పెంచేశారు. బీరు, క్వార్టర్ బాటిళ్లకు రూ. 5 నుంచి రూ. 10 వరకు ధర పెంచేశారు.