మెట్రో ట్రాక్‌పై హైడ్రామా: 24 నిమిషాలు స్తంభించిన బ్లూ లైన్! | Kolkata Metro: Morning Suicide Attempt at Kalighat Station Disrupts Blue Line Services | Sakshi
Sakshi News home page

మెట్రో ట్రాక్‌పై హైడ్రామా: 24 నిమిషాలు స్తంభించిన బ్లూ లైన్!

Jun 27 2026 12:45 PM | Updated on Jun 27 2026 12:54 PM

Kolkata Metro: Morning Suicide Attempt at Kalighat Station Disrupts Blue Line Services

కోల్‌కతా: శనివారం ఉదయం కోల్‌కతా మెట్రో నెట్‌వర్క్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. కాళీఘాట్ మెట్రో స్టేషన్‌లో ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టడంతో బ్లూ లైన్ పరిధిలోని రైలు సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఉదయం పూట ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లే వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెట్రో సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్  స్పందించి సకాలంలో చర్యలు చేపట్టడంతో ఒక ప్రాణం నిలబడటంతో పాటు ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించింది.

ఉదయం 7.20కి స్తంభించిన రైళ్లు
మెట్రో రైల్వే అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం సుమారు 7:20 గంటల సమయంలో కాళీఘాట్ స్టేషన్‌లోని అప్ లైన్‌ పట్టాలపైకి ఒక వ్యక్తి అకస్మాత్తుగా దూకాడు. అది గమనించిన వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది, ప్రమాదాన్ని నివారించేందుకు ట్రాక్‌లకు సరఫరా అయ్యే విద్యుత్‌ను తక్షణమే నిలిపివేశారు. ఆ వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఊహించని ఘటనతో కవి సుభాష్- దక్షిరేశ్వర్ స్టేషన్ల మధ్య నడిచే బ్లూ లైన్ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రయాణికుల రద్దీ.. పాక్షిక సర్వీసుల నిర్వహణ
రద్దీగా ఉండే ఉదయం వేళల్లో మెట్రో సేవలు ఆగిపోవడంతో పలు స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మెట్రో అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా, ప్రభావితం కాని మార్గాల్లో పాక్షిక  సర్వీసులను నడిపారు. దక్షిరేశ్వర్ నుంచి మైదాన్ వరకు, అలాగే మహానాయక్ ఉత్తమ్ కుమార్ (టోలీగంజ్) నుంచి కవి సుభాష్ స్టేషన్ల మధ్య మాత్రమే ఈ సమయంలో రైళ్లను నడిపించారు.

ప్రాణాలతో బయటపడిన వ్యక్తి
మెట్రో సిబ్బంది, ఆర్‌పిఎఫ్ బలగాలు సకాలంలో స్పందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అధికారులు ట్రాక్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్నాక ఉదయం 7:44 గంటలకు బ్లూ లైన్ పూర్తిస్థాయి సేవలను పునరుద్ధరించారు. కేవలం 24 నిమిషాల్లోనే పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చినప్పటికీ, రద్దీ సమయంలో జరిగిన ఈ అంతరాయం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement