కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు  | Three Arrested In Kolkata Law College Student Molestation, Check More Details Inside | Sakshi
Sakshi News home page

కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు 

Jun 28 2025 6:00 AM | Updated on Jun 28 2025 12:52 PM

Kolkata law college student molestation, three arrested

లా కాలేజీ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం!

కోల్‌కతాలో మరో దారుణం 

ముగ్గురి అరెస్ట్, ఐదు రోజుల రిమాండ్‌ 

ఒకరి అఘాయిత్యం, ఇద్దరి సహకారం 

ఫిర్యాదులో పేర్కొన్న బాధితురాలు 

ప్రధాన నిందితుడు తృణమూల్‌ నేత 

కోల్‌కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్‌జీ కర్‌ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్‌కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్‌ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనపై పశ్చిమబెంగాల్‌ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్‌ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్‌ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. 

సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్‌ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్‌ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.

 మా కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్న జయీబ్‌ అహ్మద్‌ (19), ప్రమీద్‌ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్‌ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్‌ బెదిరించాడు.

 నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్‌ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్‌ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు.

 గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్‌ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్‌ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.

అతనో క్రిమినల్‌ లాయర్‌ 
ప్రధాన నిందితుడు మోనోజిత్‌ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్‌ పోలీస్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టులో క్రిమినల్‌ లాయర్‌గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్‌కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్‌ శ్రేణులు కస్బా పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసనకు దిగాయి.

తృణమూల్‌ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
 అత్యాచారోదంతంపై తృణమూల్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందించింది. 

ప్రధాన నిందితుడు మోనోజిత్‌తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్‌ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్‌ నేతలతో పాటు మోనోజిత్‌ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ సువేందు అధికారి మండిపడ్డారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement