పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి? | Sakshi
Sakshi News home page

Kite Business: పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి?

Published Sun, Jan 14 2024 1:47 PM

Kite Business in Gujrat is Growing Very Well - Sakshi

మకర సంక్రాంతి పర్వదినం గుజరాత్‌కు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి కారణం గుజరాత్ అంతటా గాలిపటాలు ఎగరడమే. ఈసారి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రతినిధులు గాలిపటాలు ఎగురవేయడంపై ఆసక్తి చూపారు.

మునుపెన్నడూ లేనంతగా పతంగులపై ప్రజలు ఇంత ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అంతర్జాతీయ పతంగుల పండుగలో గతానికంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక్కరోజులో హఠాత్తుగా జరిగినది కాదు. దీని వెనుక 20 ఏళ్లకు పైగా శ్రమ ఉంది. ఈ గాలిపటాల పండుగ గుజరాత్ సంస్కృతిని అందరికీ తెలిసేలా చేసింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యతనిచ్చి, ప్రపంచం గుర్తించేలా చేశారు. 

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గుజరాత్‌లో 1989 నుండి అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, 2005లో వైబ్రెంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో ఈ ఉత్సవానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గుజరాత్ పతంగులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికను 2003లో అప్పటి ముఖ్యమంత్రి మోదీ సిద్ధం చేశారు. అది గుజరాత్‌లో గాలిపటాల పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడింది.

తమిళనాడులోని గాలిపటాల పరిశ్రమలపై  అధ్యయనం చేసి, స్థానికంగా గాలిపటాల పరిశ్రమ అభివృద్ధికి వ్యూహాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పటి సీఎం నరేంద్ర మోదీ అధికారులను కోరారు. 2003లో నిపుణుల బృందం గాలిపటాల పరిశ్రమలు కలిగిన అనేక ప్రదేశాలలో సమగ్ర సర్వేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రభుత్వం స్థానికంగా గాలిపటాల పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 

2003లో నాటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని గాంధీ లేబర్ ఇన్‌స్టిట్యూట్‌లో గుజరాత్ కైట్ ఇండస్ట్రీ వర్క్ క్యాంప్ నిర్వహించారు. దీనిద్వారా గాలిపటాల కళాకారులు, పంపిణీదారులు, ప్రభుత్వ సంస్థలు, డిజైనర్లు, ఆర్థిక సంస్థల మధ్య కమ్యూనికేషన్‌ కోసం ప్రయత్నించారు. ఈ వర్క్‌క్యాంప్‌కు భాను భాయ్ షాను కూడా ఆహ్వానించారు. భాను భాయ్ ప్రముఖ కైట్‌సర్ఫర్. 50 సంవత్సరాలుగా గాలిపటాలు సేకరించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. 

అవసరమైన ముడి పదార్థాల లభ్యతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గాలిపటాల పరిశ్రమను మరింత సులభతరం చేయాలని మోదీ కార్పొరేట్ సంస్థలను కోరారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న లక్షకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా గాలిపటాల పరిశ్రమను మోదీ అభివృద్ది చేశారు. గాలిపటాల తయారీ అనేది 2003-04 లో కుటీర, గ్రామీణ పరిశ్రమల స్థాయికి చేరింది. 

ఫలితంగా గుజరాత్‌లో గాలిపటాల పరిశ్రమ కొత్త మలుపు తిరిగింది. 2003-04 సంవత్సరంలో గాలిపటాల పరిశ్రమ టర్నోవర్ రూ. 15-20 కోట్లుగా ఉంది. కైట్ ఫెస్టివల్ విజయవంతం కావడంతో ఈ పరిశ్రమ పరిధి మరింత విస్తరించింది. 2007లో ఈ పరిశ్రమ టర్నోవర్‌తో రూ. 100 కోట్లకు చేరుకుంది.  

2010నాటికి ఇది రూ. 400 కోట్ల పరిశ్రమగా మారింది. 2014 సంవత్సరంలో, గుజరాత్  గాలిపటాల ప్రపంచ వ్యాపారం రూ. 500 కోట్ల రూపాయలకు చేరింది. ఇది గుజరాత్‌లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా చెబుతారు. గుజరాత్‌లోని గాలిపటాల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది మహిళలే ఉ‍న్నారు. మోదీ అనంతర ప్రభుత్వా​లు నేటికీ గాలిపటాల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్‌ బాబా’ పతంగులకు డిమాండ్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement