పుత్తడి నిల్వల్లో యూకేను మించిపోయాయి
ఈ సంస్థల వద్ద 381 టన్నుల పసిడి నిల్వలు.. ఇవి ఒక దేశమైతే ప్రపంచంలో 16వ స్థానంలో
వెనుకంజలో స్పెయిన్, ఆస్ట్రియా,బ్రెజిల్, ఆ్రస్టేలియా
సాక్షి, స్పెషల్ డెస్క్: ఒక్కో కుటుంబంలో ఎంత బంగారం ఉంటుంది. సామాన్యుల దగ్గరైతే తులాల్లో ఉంటుంది. సంపన్నులైతే కిలోల్లో. మరి మన కేరళలోని నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) వద్ద ఉన్న పసిడి ఎంతో తెలుసా? జస్ట్ 381 టన్నులు. ఈ కంపెనీలన్నీ ఒక దేశమైతే.. నిల్వల పరంగా ఈ దేశం ప్రపంచంలో 16వ స్థానంలో ఉండేదంటే ఆశ్చర్యంవేయక మానదు. అనేక యూరోపియన్ దేశాల కంటే ఈ నిల్వలు అధికంగా ఉండడం విశేషం.
విదేశీ మారక ద్రవ్య ఆస్తులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వంటి కేంద్ర బ్యాంకులు బంగారాన్ని టన్నుల కొద్దీ కొనుగోలు చేసి అట్టిపెట్టుకుంటాయి.
అయితే కేంద్ర బ్యాంకులు కలిగి ఉన్న పసిడి నిల్వల పరిమాణంలో అంతర్జాతీయంగా భారత్ 7వ స్థానంలో ఉంది. 2025 సెపె్టంబర్ నాటికి ఆర్‌బీఐ వద్ద 880.18 టన్నుల పుత్తడి ఉంది. కేరళకు చెందిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వద్ద కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం ఏకంగా 381 టన్నులకు చేరుకుంది. అంటే ఆర్‌బీఐ వద్ద పోగైన పసిడిలో 43.28% అన్నమాట. ప్రపంచంలో బంగారం వినియోగంలో అతిపెద్ద కస్టమర్‌గా భారత్ నిలిచింది. భారతీయుల వద్ద 25,000 టన్నుల పైచిలుకు పసిడి ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇక దేశీయ రుణ మార్కెట్‌లో 2,950–3,350 టన్నుల పుత్తడి పూచీకత్తుగా ఖజానాలలో దాచినట్టు అంచనా.
వెనుకంజలో పెద్ద దేశాలు
కేరళకు చెందిన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియర్లు ఒక దేశమైతే.. పోర్చుగల్‌తో అమీతుమీ తేల్చుకునే స్థాయిలో పోటీపడేది. 382.66 టన్నులతో పోర్చుగల్ 15వ స్థానంలో ఉంది. అంతేకాదు అనేక యూరోపియన్ దేశాల అధికారిక నిల్వలను కేరళ ఎన్‌బీఎఫ్‌సీలు మించిపోవడం విశేషం. ఈ గోల్డ్ లోన్ కంపెనీల వారీగా చూస్తే ముత్తూట్ ఫైనాన్స్ 208 టన్నుల నిల్వలతో అప్రతిహతంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్‌ప్రైజెస్ (కేఎస్‌ఎఫ్‌ఈ) 67.22 టన్నులు, మణప్పురం ఫైనాన్స్ 56.4, ముత్తూట్ ఫిన్‌కార్ప్ 43.69, ఇండెల్ మనీ వద్ద సుమారు 6 టన్నుల పుత్తడి ఉంది. ఈ సంస్థల వద్ద ఉన్న మొత్తం నిల్వలు 381 టన్నులు దాటిపోయాయి. అయితే యూకే 310.29, స్పెయిన్ 281.58, ఆస్ట్రియా వద్ద 279.99 టన్నులు ఉంది. బ్రెజిల్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సైతం కేరళ ఎన్‌బీఎఫ్‌సీల కంటే వెనుకంజలోనే ఉన్నాయి.
బంగారం పొదుపు సాధనమేకాదు హోదాకు చిహ్నం. అవసరానికి ఆదుకునే ఆపన్నహస్తం. అందుకే భారత్‌లో బంగారు రుణాల వ్యాపారం దశాబ్దాలుగా ఆర్థికంగా శక్తివంతంగా మారింది. తృతీయ, ఆ తర్వాతి స్థాయి నగరాలు, చిన్నపట్టణాలు, పల్లెల్లో బంగారు రుణాలే తక్షణ అవసరాలకు మొదటి ప్రాధాన్యత. వ్యాపారం, పిల్లల చదువుకయ్యే ఫీజులు, ఇంటి అవసరాలు, అత్యవసరాలు.. కారణం ఏదైనా తొలుత గుర్తొచ్చేది ఇంట్లో ఉన్న బంగారమే. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1.24 లక్షలు దాటింది.
పుత్తడి ఈ స్థాయిలో ప్రియం కావడంతో బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది. గ్రాముకు రూపాయి లభ్యత పెరిగింది. ప్రజలు తమ ఆభరణాలను తాకట్టు పెడుతుండటంతో మార్కెట్లోకి మరింత బంగారం వస్తోంది. ద్రవ్య కొరత రుణగ్రహీతలను బంగారం ఆధారిత క్రెడిట్ కోసం మళ్లేలా చేస్తోంది. కంపెనీలు కస్టమర్ల నుంచి ఆధార్ కార్డు తీసుకుని నిమిషాల్లో రుణం ఇస్తున్నాయి.
అంతరాన్ని పూరిస్తున్నాయి..
బంగారం ధరల పెరుగుదల భారత మార్కెట్‌కు.. ప్రధానంగా తక్కువ ఆదాయ వర్గాలకు వరంగా మారింది. అన్‌సెక్యూర్డ్ లోన్స్‌పై పరిమితుల కారణంగా బ్యాంకుల నుంచి అప్పు దొరకడం అంత సులభం కాదు. కానీ బంగారు రుణాలు ఆ అంతరాన్ని పూరిస్తున్నాయి. భారత్‌లోని బంగారు రుణాల్లో వ్యవస్థీకృత సంస్థల వాటా 37%. మిగిలిన 63% వాటాను చిన్న ఫైనాన్షియర్లు, స్థానిక వడ్డీ వ్యాపారుల వంటి నియంత్రణ లేని అవ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. అయితే రుణం తిరిగి చెల్లించని పక్షంలో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని నిర్దేశిత కాలం తర్వాత కంపెనీలు వేలం వేస్తాయి. తాకట్టు పెట్టిన దాంట్లో వేలం వేసిన పసిడి వాటా గతంలో 2.5% ఉండేది. ఇప్పుడు ఇది ఒక శాతానికి వచి్చంది.
⇒ మన దేశంలో ఖజానాల్లో పూచీకత్తుగా ఉన్న బంగారం 2,9503,350 టన్నులు
⇒ కేరళ ఎన్‌బీఎఫ్‌సీల వద్ద కస్టమర్లు తాకట్టు పెట్టిన పసిడి 381 టన్నులు
⇒ భారతీయుల వద్ద ఉన్న బంగారం 25,000 టన్నులు
⇒ 2025 సెపె్టంబర్ నాటికి ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు 880.18 టన్నులు
⇒ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడిలోఅంతర్జాతీయంగా భారత్ స్థానం


