కాశ్మీర్ లోయవ్యాప్తంగా దాడులు, 9 మంది అరెస్ట్
శ్రీనగర్: ఆన్‌లైన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపుతూ.. కౌంటర్–ఇంటెలిజెన్స్ కాశ్మీర్ ఆదివారం లోయవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక మహిళతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఆన్‌లైన్‌లో కీర్తించడం, యువకులను ప్రభావితం చేయడంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కౌంటర్–ఇంటెలిజెన్స్ కాశ్మీర్ బృందాలు శ్రీనగర్, కుల్గామ్, బారాముల్లా, షోపియాన్, పుల్వామాలోని 10 ప్రత్యేక ప్రాంతాలపై దాడులు చేశాయని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘ఆన్‌లైన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టడంలో భాగంగా కాశ్మీర్ లోయవ్యాప్తంగా సమన్వయంతో దాడులు నిర్వహించాం.. ఇది తీవ్రవాదం, సైబర్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక సందేశాన్ని పంపింది’.. అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది అనుమానితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లెట్‌లు, పలు రకాల డిజిటల్ పరికరాలు మొదలుకొని నేరారోపణకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వా«దీనం చేసుకున్నట్లు వెల్లడించారు.


