
సీఎం సిద్ధరామయ్య సిఫారసుకు గవర్నర్ ఆమోదం
సొంత పార్టీ నేతలపై ఓట్ల రిగ్గింగ్ ఆరోపణల ఫలితం
రాజన్న వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలన్న బీజేపీ
బెంగళూరు: కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్నను సీఎం సిద్ధరామయ్య కేబినెట్ నుంచి తొలగించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ థావర్‌చంద్ర గహ్లోత్‌కు సోమవారం మధ్యాహ్నం సిఫారసు చేశారు. ఈ సిఫారసుపై గవర్నర్ ఆమోద ముద్ర వేశారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాయి. పదవికి రాజీనామా చేయాలని కోరగా రాజన్న స్పందించలేదని, అందుకే తొలగించారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
సిద్ధరామయ్యకు విధేయుడిగా పేరున్న రాజన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి కారణ మ య్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహదేవపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓట్ల చోరీకి పాల్పడ్డారంటూ సొంత పార్టీ నేతలపై ఆరోప ణలు చేయడం కలకలం రేపింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీకి దిగిందంటూ ఇటీవల తీవ్ర విమర్శలు చేస్తుండటం తెల్సిందే. అయితే, సోమవారం ఉదయం మంత్రి రాజన్న మీడియా ఎదుట తమ పార్టీ హయాంలో ఓట్ల చోరీ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటరు జాబితా సవరణలను పార్టీ నేతలు సరిగ్గా పరిశీలించకపోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటరు జాబితా తయారీ సమయంలో మౌనంగా ఉన్నారని ఆరోపించారు. దీంతో, ఒకే వ్యక్తి పేరు మూడు చోట్ల కనిపించిందని, తక్కువ మంది ఉండే చాలా ప్రాంతాల్లో అనుమానాస్పద పేర్లను జత చేశారని పేర్కొన్నారు. మంత్రి రాజన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, నేత రాహుల్ సహా అగ్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. వెంటనే ఆయన్ను రాజీనామా చేయాలని తాఖీదులు పంపింది. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చినట్లయింది. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో పస లేదని రాజన్న వ్యాఖ్యలతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది.
తప్పు ఎత్తి చూపినందుకు ఎస్‌టీ వర్గానికి చెందిన రాజన్నతో బలవంతంగా రాజీనామా చేయించారంది. నిజం మాట్లాడితే కాంగ్రెస్ శిక్ష రాజీనామాయే అని బీజేపీ ఎంపీ మోహన్ వ్యాఖ్యానించారు. నిజాన్ని అంగీకరించే ధైర్యం కాంగ్రెస్‌పార్టీకి లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. ఓట్ల చోరీ బీజేపీ హయాంలో జరిగిందని రాహుల్ ఆరోపిస్తుండగా, సీఎం సిద్ధరామయ్య హయాంలో అవకతవకలు జరిగినట్లు తాజాగా రుజువైందన్నారు. ఇందుకు రాహుల్, సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఈ ముగ్గురిలో ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రాజన్న వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.