
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు దర్యాప్తు లోతుకు వెళ్లే కొద్దీ షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్య పల్లవి ఆయనపై ఓ బాటిల్‌తో దాడి చేసి.. ఆపై కారం పొడి చల్లి కట్టేసి మరీ కడతేర్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రాణం పోతున్న టైంలో పోలీసులకు సమాచారం అందించిన ఆమె.. భర్త ముఖం మీద గుడ్డ కప్పి తాపీగా కుర్చీలో కూర్చుని చూస్తున్నట్లు తేలింది.
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(Ex DGP Om Prakash) తనయుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓం ప్రకాశ్ భార్య పల్లవి, కూతురు క్రుతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత 12 ఏళ్లుగా స్కిజోఫ్రెనియా(Schizophrenia)తో బాధపడుతోంది. నగరంలోని ఓ ప్రముఖ వైద్యుడి దగ్గర ఆమె చికిత్స కూడా తీసుకుంటోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా భర్తపైనా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ వస్తోంది. తన ప్రాణాలకు తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని.. తుపాకీతో పలుమార్లు బెదిరించడాన్ని ఫ్యామిలీకి చెందిన ఐపీఎస్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు పెడుతూ వచ్చింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి తెలిసిన ఓం ప్రకాశ్.. ఆ చేష్టలను తేలికగా తీసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో.. ఈ మధ్య ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఈ కారణాలతోనే ఆమె భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చినట్లు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.

ఆదివారం సాయంత్రం నుంచి పల్లవి(Pallavi)ని, క్రుతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఈ కేసులో అరెస్టులు చేస్తామని బెంగళూరు కమిషనర్ బీ దయానంద్ చెబుతున్నారు. ఈ ఘటనను దురదృష్టకరమైందిగా అభివర్ణించిన హోం మంత్రి పరమేశ్వర.. ఓం ప్రకాశ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.
1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ స్వస్థలం బిహార్‌లోని చంపారన్. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. ఆపై కుటుంబంతో బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఆయన ఛాతీలో, మెడ వద్ద, కడుపులో, చేతిలో కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర రక్త స్రావం కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన టైంలో కూతురు క్రుృతి కూడా ఇంట్లోనే ఉంది. దీంతో ఆమె పాత్ర కూడా ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.
స్కిజోఫ్రెనియా(Schizophrenia).. ఈ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ ఒక రకమైన భ్రమలో ఉంటారు. లేనిపోనివి ఊహించుకుని భయపడిపోతుంటారు. మనస్సులో ఏదో ఊహించుకుంటూ నిరంతరం ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉంటారు. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇతరులను పట్టించుకోకుండా తన మానాన తానుండటం, నిరంతర ఆలోచనలు, నిద్రలేమి, ఎవరో పిలుస్తున్నట్టుగా, తనతో మాట్లాడుతున్నట్టుగా భావించి సమాధానం ఇవ్వడంలాంటివి వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సైకియాట్రిస్టును సంప్రదించాల్సి ఉంటుంది.