
ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని మింగేస్తున్న భయంకరమైన ముప్పు. ఇది మనకెప్పుడో తెలుసు, అయినా మన చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే మనిషి నిర్లక్ష్యం ప్రకృతిలోని మిగతా జీవుల ప్రాణాలకూ ముప్పుగా మారుతోంది. తాజాగా కర్ణాటక చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరూ అయ్యో పాపం అనుకుంటున్నారు.
2025 సెప్టెంబర్ 16న కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కల్లహళి గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ పాడుబడిన ఇంట్లో ఆరడుగుల పాము కదల్లేని స్థితిలో అవస్థలు పడుతూ కనిపించింది. అది విషపూరిత కేరు హావు సర్పం (రసెల్ వైపర్) కావడంతో గ్రామస్తులు స్థానికంగా ఉండే ఉరగప్రేమి(స్నేక్ క్యాచర్) ‘స్నేక్ శివు’కి సమాచారం అందించారు. ఆయన దానిని చాకచక్యంగా పట్టుకున్నాడు. అయితే.. దాని పొట్ట భాగం ఉబ్బిపోయి కనిపించడంతో దాని ఆ అవస్థకు అదే కారణమని గుర్తించారు. వెంటనే..

చిత్రదుర్గ పశువైద్య ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వాళ్లు చేతులెత్తేయడంతో.. దానిని బెంగళూరులోని “పీపుల్ ఫర్ అనిమల్స్” (People For Animals) ఆసుపత్రికి తరలించాడు స్నేక్ శివు. అక్కడ దాని కడుపులో ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు(Plastic Bottle in Snake Stomach). వెటర్నిటీ డాక్టర్లు డా. నవాజ్ షరీఫ్, డా. మాధవ్ బృందం అక్టోబర్ 2వ తేదీన అరుదైన శస్త్రచికిత్స నిర్వహించింది. సుమారు రెండు గంటలు శ్రమించి.. సర్జరీ చేసి దాని పొట్ట నుంచి బాటిల్‌ను తొలగించింది.

అది ఒక సన్‌స్క్రీన్ లోషన్ బాటిల్ అని, ఆ బాటిల్ కారణంగా దాని పేగు తెగిపోయి కదల్లేని స్థితిలో.. ప్రాణాంతక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడిందని తెలిపారు. ప్రస్తుతం పాము అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుందని, అది కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని వారు అంటున్నారు. ఆ తర్వాతే దానిని సమీపంలోని అడవిలో వదిలిపెడతామని తెలిపారు. పామును రక్షించిన స్నేక్ శివుపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టూ!